లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైనా ఆఫీస్ పనుల్లోనో.. కాలేజీ చదువులతోనో.. మరేవైనా ఇతర వ్యాపకాలతో ఎక్కువ సమయం పాటు కుర్చీలకు అతుక్కుపోయే పరిస్థితి. ఒకే చోట కూర్చొని గంటలు గంటలు పని చేయడం కాస్త ఇబ్బందే. అందులోనూ మీరు కుర్చీలో కూర్చొనే పద్ధతి సరిగా లేకుంటే వెన్ను సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. మెడ, భుజాల్లో నొప్పి రావొచ్చు. అందుకే ఎక్కువ సమయం కూర్చొని పని చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవిగోండి కొన్ని వీటిని ఫాలో అయిపోండి.
ఆఫీసులో మాదిరే ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండకపోవచ్చు. ఇంట్లో ఆఫీస్ డెస్క్‌ని సెటప్ చేసుకోవడమూ కొందరికి కుదరకపోవచ్చు. అందుబాటులో ఉన్న వాటితోనే ఆఫీస్ డెస్క్‌ని సెట్ చేసుకోండి.
గంటల పాటు కూర్చునే పని చేయాల్సివస్తే మెడ, నడుముకు చక్కని సపోర్టుగా నిలిచే ఎయిర్గ్రోమిక్ కుర్చీలు (ergonomic chair) లను వాడడం మంచిది. అసౌకర్యంగా అనిపించినప్పుడు సీట్‌హైట్, ఆర్మ్‌రెస్ట్, బ్యాక్‌రెస్ట్‌లను మీకు అనువుగా మార్చుకోవచ్చు.
మీ ఎత్తుకు అనుగుణంగా కుర్చీ ఎత్తుని సెట్ చేసుకోండి. ఫూట్‌రెస్ట్ లేదా నేలపై కాళ్లు సరిసమానంగా అనేలా చూసుకోవాలి. వెన్నుపై ఎక్కువ ఒత్తిడి పడకుండా మోకాళ్లను 90డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోండి.
- ఎప్పుడూ చేతులను కుర్చీ లేదంటే టేబుల్‌పైన సపోర్టు ఉండేలా చూసుకోండి. టైపింగ్ చేస్తున్నప్పుడు మీ మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోండి.
వీపునకు సపోర్టు లేని కుర్చీ వాడుతున్నట్లయితే ప్రతి 20 నిమిషాలకోసారి విరామం తీసుకోండి లేదా ఎప్పటికప్పుడు మీరు కూర్చున్న విధానాన్ని మార్చుకోండి.
మీరు కూర్చున్న ఎత్తుకు సరిపడినట్టుగా ల్యాపీని పెట్టుకోవాలి. మీ కళ్లకు సమాతరంగా ల్యాపీ లేదా డెస్క్‌టాప్ స్క్రీన్ కనిపించేలా ఉండడం ఉత్తమం. కుదిరితే వైర్‌లెస్ కీబోర్డు, మౌస్ ప్రయత్నించండి.
వీలైనంత వరకూ వెన్ను నిటారుగా ఉంచేందుకే ప్రయత్నించాలి. వెన్నుని వంచి కూర్చోవడం ఏ మాత్రం సురక్షితం కాదు.
మంచం, సోఫా లేదా బీన్ బ్యాగ్‌పై కూర్చొని పని చేస్తే కాస్త హాయిగా, సౌకర్యంగా అనిపించొచ్చు. కానీ కాసేపు మాత్రమే వాటిపై పనిచేయండి.
పాదాలు పూర్తిగా ఆనేలా సరైన ఫూట్‌రెస్ట్‌ని వాడండి. అది మీ కాళ్లలో రక్తాన్ని సాఫీగా అయ్యేందుకు దోహదపడుతుంది.
ఆఫీసులో అవసరం నిమిత్తం పలు చోట్లకు తిరుగుతుంటాం. ఇంట్లో అలాంటివి ఉండవు. దీంతో కూర్చున్నచోటే గంటల తరబడి కూర్చోకుండా నిర్ణీత సమయానికోసారి లేచి అటూ, ఇటూ తిరగండి.
ఇదీ చదవండి...తస్మాత్ జాగ్రత్త.. మురుగునీటి పైపులు ద్వారా కరోనా