SIT Gets Five Day Custody Completed Of Four Accused : తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితులకు సిట్ విచారణ ముగిసింది. తిరుపతి సిట్ కార్యాలయంలో ఐదు రోజులపాటు విచారణ సాగింది. కస్టడీలో వివిధ అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైయిరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావ్డా, తమిళనాడులోని ఏఆర్ డైయిరీ ఎండీ రాజశేఖర్‌ను 5 రోజులు సిట్ అధికారులు ప్రశ్నించారు.
విచారణకు సహకరించలేదు : విచారణకు కోర్టు విధించిన గడువు పూర్తవడంతో నిందితులను రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి రెండవ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నిందితులు విచారణకు సహకరించలేదని మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఈ రోజు జరగాల్సిన నిందితుల బెయిల్ విచారణ రేపు(బుధవారం) జరగనుంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టైన నలుగురు నిందితులను కొద్దిరోజులు క్రితం కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ నిర్వహిస్తోంది. సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు నేతృత్వంలో సాగుతున్న దర్యాప్తు బృందం నలుగురిని గత ఆదివారం అరెస్టు చేసింది.
న్యాయవాదుల సమక్షంలో విచారణ : ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైయిరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా, తమిళనాడులోని ఏఆర్ డైయిరీ ఎండీ రాజశేఖరన్ అరెస్టు అయ్యారు. వీరిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ న్యాయస్ధానాన్ని సిట్ అధికారులు కోరారు. సిట్ అధికారులు వేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిపిన తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు నలుగురు నిందితులను 5 రోజుల కస్టడికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి న్యాయవాదుల సమక్షంలో విచారణ నిర్వహించేందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి కోటేశ్వరరావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు వీరి విచారణ జరిగింది.
తిరుమల కల్తీ నెయ్యి కేసు అప్డేట్ - నలుగురి రిమాండ్
తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసు - సిట్ రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు