Amaravati Farmers padayatra: అమరావతి రైతులు, దేవుని రథంపై వైకాపా శ్రేణులు మంగళవారం జరిపిన దాడిచూసి తట్టుకోలేకపోయామని రాజమహేంద్రవం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరాభిమానాలు, ప్రేమాప్యాయతలకు పెట్టింది పేరైన రాజమహేంద్రవరంలో దాడి జరగడం ఎంతో బాధించిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రైతులు, మహిళలకు అండగా ఉండాలనే వారితో కలిసి.. పాదయాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చామన్నారు. 38వ రోజు రాజమహేంద్రవరం శివారులోని మోరంపూడి జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభంకాగా..పెద్దఎత్తున పల్లెజనం తరలివచ్చారు. ప్రతి ఇంటి వద్ద మహిళలు పాదయాత్ర చేస్తున్న వారిని ఆపి బొట్టు పెట్టి, హారతులిచ్చారు. ఏకైక రాజధాని అమరావతికే తమ మద్దతని తేల్చిచెప్పారు.
శాంతియుతంగా తాము పాదయాత్ర చేస్తుంటే వైకాపా శ్రేణులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. ఎండకు ఎండి, వానకు తడిచి ఆరోగ్యం పాడైపోతున్నా లెక్కచేయకుండా నడుస్తుంటే.. ప్రభుత్వం కుట్రపూరితంగా దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పాల్గొన్నారు. రైతులతో కలిసి కొంతదూరం నడిచారు. ప్రత్యేక హోదా కోసం భాజపాతో పోరాటం చేయడం చేతకాని సీఎం జగన్.. రైతులపై దాడి చేయిస్తున్నారని డి.రాజా మండిపడ్డారు. దాడికి పాల్పడ్డవారిపై ఇంతవరకు ఎందుకు కేసులు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సినీనటుడు తారకరత్న సైతం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
అమరావతి కోసం పోరాటం సాగిస్తున్న రైతులకు సీపీఐ తరఫున పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నాం. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. జగన్ కూడా గతంలో అంగీకరించారు. కానీ ఇప్పుడు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. పాదయాత్రపై కొందరు గూండాలు దాడి చేశారు. దీనిపై పోలీసులు తీసుకున్న చర్యలేంటి..? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది..?-డి. రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి
మండుటెండలో పాదయాత్ర చేస్తున్న రైతులకు స్థానికులు సాయం చేసి ఉదారత చాటుకున్నారు. చెరుకు రసం వ్యాపారులు చెరుకు రసం అందించగా.. మరికొందరు మజ్జిగ, పళ్లరసాలు అందించారు. కొందరు బైక్‌లపై ఎక్కించుకుని వృద్ధులను భోజన విరామ కేంద్రానికి తరలించారు. మోరంపూడి జంక్షన్ నుంచి ప్రారంభమైన రైతుల మహాపాదయాత్ర.. హుకుంపేట, బొమ్మూరు, రాజవోలు మీదుగా కేశవరం వరకు సాగింది.
ఇవీ చదవండి: