ఇంద్రకీలాద్రిపై మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు దర్శనాలు నిలిపివేత - vijayawada durga temple in krishna district latest news
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఐదో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా వేడుకల్లో భాగంగా అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకూ.. అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తారు. మధ్యాహ్నం నుంచి శ్రీమహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఇంద్రకీలాద్రిపై మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లతో భాగంగా ఇవాళ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ రెండు అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ.. మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైన అలంకారమని ప్రతీతి. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం.
మధ్యాహ్నం శ్రీమహాలక్ష్మీదేవి అవతారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్టసంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.
ఇంద్రకీలాద్రిపై మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 వరకు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు వినాయక గుడి వద్ద క్యూలైన్‌లోని భక్తులను నిలిపివేశారు. క్యూలైన్‌లో ఉన్నవారికి మధ్యాహ్నం 12 గంటల్లోపు దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. అర్జునవీధిలో అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఆలయానికి, భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
రేపు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజైన రేపు అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు పరిశీలించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అమ్మవారి దర్శనానికి రానున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులకు దేవాదాయ శాఖ తరఫున స్వాగతం పలికి చినరాజగోపురం నుంచి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల సమర్పణ, అంతరాలయంలో పూజలు, అనంతరం వేదపండితుల ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: tirumala: శ్రీవారి బ్రహోత్సవాలు... మోహినీ అవతారంలో శ్రీనివాసుడు