పోస్టింగ్ ఇస్తూ ఓ అధికారిణికి ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో చేరేందుకు ఆమె బయలుదేరారు. గమ్యస్థానం చేరుకోకముందే వెనక్కి వచ్చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఫోన్ వచ్చింది. దాంతో వెనుదిరగక తప్పలేదామెకు. తెలంగాణలోని పెద్దపల్లి డీసీపీ పోస్టింగ్ వ్యవహారంలో చోటుచేసుకున్న ఈ పరిణామం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి డీసీపీ పోస్టు కొద్దిరోజుల క్రితం ఖాళీ అయింది.
అంతకుముందు ఇక్కడ పనిచేసిన రవీందర్‌పై ఆరోపణలు రావడంతో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. మంచిర్యాల ఇంఛార్జి డీసీపీగా ఉన్న అఖిల్ మహాజన్‌కు ఇంఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ స్థానంలో ఇంటెలిజెన్స్ విభాగంలో నాన్‌కేడర్ ఎస్పీగా ఉన్న సాయిశ్రీకి తాత్కాలికంగా అటాచ్‌మెంట్ పోస్టింగ్ ఇస్తూ శుక్రవారం రాత్రి డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు శనివారం ఆమె విధుల్లో చేరేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కరీంనగర్ చేరుకునే సమయంలో ఉన్నతాధికారి ఒకరు ఆమెకు ఫోన్‌చేసి, వెనక్కి వచ్చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆమె పెద్దపల్లి చేరుకోకుండానే హైదరాబాద్ తిరిగి వచ్చేసినట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లాకు చెందిన కొందరు కీలక ప్రజాప్రతినిధులు, నేతలు అభ్యంతరం వ్యక్తంచేయడమే దానికి కారణమని తెలుస్తోంది.
ఇదీ చదవండి: