PROTEST: కొత్తపేటలో జనసేన, విద్యార్థి సంఘాల ధర్నా.. ఉద్రిక్తత - జనసేన అధికార ప్రతినిధి
విజయవాడ వన్ టౌన్ పరిధిలోని కొత్తపేటలో ఎస్‌కేపీవీ హిందూ హైస్కూల్ వద్ద జనసేన, విద్యార్థి సంఘాలు చేపట్టిన ధర్నా.. ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన చేపడుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. పోలీసుల వాహనాలను అడ్డుకునేందుకు పలువురు యత్నించారు.
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో జనసేన, పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. జీవో నంబర్ 42కు వ్యతిరేకంగా విజయవాడ వన్ టౌన్ పరిధి కొత్తపేటలోని ఎస్‌కేపీవీ హిందూ హై స్కూల్ ముందు ఆందోళన చేపడుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిఘటించిన విద్యార్థులు పోలీసుల వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో అదుపులోకి తీసుకున్న నాయకులను పోలీసులు వదిలేశారు. దీంతో విద్యార్థులు శాంతించారు.
జీవో నంబర్ 42ను వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులతో కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. విజయవాడ వన్ టౌన్ పరిధిలో సుమారు 10 వేల మంది పిల్లలు ఎయిడెడ్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.. ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నందున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థులతో సబ్ కలెక్టర్ చర్చలు సఫలం...
నందిగామ కెవీఆర్ కళాశాల విద్యార్థులతో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ర చర్చలు సఫలమయ్యాయి. విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారిసామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వెళ్ళిన అధ్యాపకులను కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి తిరిగి వచ్చే విధంగా చేస్తామని ఆయన తెలిపారు. సబ్ కలెక్టర్ ఇచ్చిన హమీతో విద్యార్ధులు నిరసన విరమించారు. నిన్న విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన కేసుల తొలగిచాలని వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి..