ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కి అన్ని విధాలా కృషి చేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ పేర్కొన్నారు. అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యానాధ్ దాస్ నుంచి సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. సిఎస్ గా పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు పథకం విజయవంతంగా అమలు జరిగేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. 1961లో ఉత్తరప్రదేశ్ లో జన్మించిన సమీర్ శర్మ 1985వ బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ కేడర్ లో చేరారు. గుంటూరులో అసిస్టెంట్ కలెక్టర్ గా, నరసాపురం సబ్ కలెక్టర్ గా సర్వీసు ప్రారంభించారు.
తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గాను ,విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు మున్సిపల్ కమీషనర్ గాను, 1994-96 మధ్య తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గాను పనిచేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. పరిశ్రమల శాఖ కమీషనర్ గాను, ఆర్ధిక శాఖ కార్యదర్శిగా, ఐటి శాఖ కార్యదర్శి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమీషనర్ గాను పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలోను వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆయన రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఆ రోజు కారు డ్రైవర్ ప్రాణాలు కాపాడారు...
ప్రభుత్వ సర్వీసులో చేరాక ప్రతీ పనిని బృందంగా చేయడం నేర్చుకున్నానని..ప్రతి రోజును ఉద్యోగంలో చేరిన తొలి రోజుగానే భావిస్తానని రాష్ట్ర మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ చెప్పారు. కలెక్టర్గా వరంగల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్లు తన మీద కాల్పులు జరిపారన్న అయన... ఆ రోజు కారు డ్రైవర్ తన ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. సెక్రటేరియట్లో విధుల నిర్వహణ, అక్కడ తీసుకునే నిర్ణయాలపై చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమైన పనులన్నీ దిల్లీలో ఉండి నెరవేర్చే ప్రయత్నం చేస్తానని ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. సలహాదారు పదవిలో దిల్లీకి వెళ్తున్నా.. ఏపీ అధికారులకు సహకారం అందించి రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానన్నారు.
ఇదీచదవండి.