గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసుకున్న ఒప్పందాలను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి.. దూకుడుగా ముందుకెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు రీ టెండర్ నిర్వహించడం సరైన నిర్ణయం కాదంటూ ప్రాజెక్టు అథారిటీ చేసిన సూచనలను ప్రభుత్వం పక్కన పెట్టింది. రూ.4,987.5 కోట్ల వ్యయంతో రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా నోటిఫికేషన్‌తో..
పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో 3600 కోట్ల రూపాయల మేర అంచనాలు పెరిగాయని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌లో హెడ్స్ వర్క్ మిగిలిన పనులకు 1,887.5 కోట్ల రూపాయలకు, హైడెల్ ప్రాజక్ట్ 3,100 కోట్ల రూపాలకు కలిపి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇనీషియల్ బెంచ్ మార్క్ కింద 4,900 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. 2014 లో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకున్న మైనస్ 14 శాతానికి స్టాండెడ్ సర్వీస్ రేట్లు కలిపింది. పోలవరం ఎడమ కాలువ 65వ ప్యాకేజీ పనులకు 275 కోట్లు అంచనా వేసింది. పోలవరం ప్రాజెక్టు అధికారులు ఇ-టెండరింగ్ వెబ్ సైట్లోకి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ నమోదు చేస్తున్నారు.
మార్గదర్శకాలు జారీ..
పోలవరం ప్రాజెక్టుకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతోనే రివర్స్ టెండరింగ్ కు సంబంధించిన మార్గదర్శకాలను మెుదట ప్రభత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ పేరిట శుక్రవారం విడుదలైన జీవోలో రివర్స్ టెండరింగ్ విధివిధానాలను పొందుపరిచారు. దాని ఆధారంగానే పోలవరం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు.
తప్పుపట్టిన పోలవరం అథారిటీ
తెదేపా ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టును కట్టబెట్టారని ఆరోపిస్తూ.. ప్రభుత్వం పోలవరం ప్రధాన గుత్తేదారు నవయుగ కాంట్రాక్టును రద్దు చేసింది. అయితే ఈ చర్యలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తప్పుపట్టింది. ఈ విషయంపై హైదరాబాద్‌లో అథారిటీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. కాంట్రాక్ట్ సంస్థను తప్పించడం సరికాదని.. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉందనీ సూచించింది. రివర్స్ టెండరింగ్ వల్ల అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని.. ఆ మొత్తాన్ని కేంద్రం భరించబోదని అథారిటీ ఛైర్మన్ జైన్ తెలిపారు. తరచూ కాంట్రాక్టులు రద్దు చేస్తూ వెళ్లడం సరైన చర్య కాదంటూ.. పీపీఏ తాజాగా లేఖ కూడా రాసింది. అయినా ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వైపే మొగ్గుచూపింది.
అంతకంటే తక్కువ ధర వస్తుందా..?
రివర్స్ టెండర్లలో కొత్తగా ఏ సంస్థలు పాల్గొననున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. పోలవరం అంచనాలకు మించి వ్యయం చేస్తున్నారనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం పాత కాంట్రాక్టర్‌ను తప్పించింది. తాజాగా 2015-16 ఎస్.ఎస్.ఆర్ ధరలను అనుసరించి కొత్త టెండర్లను పిలుస్తారని తెలుస్తోంది. అయితే పోలవరం పనులు చేపట్టిన నవయుగ సంస్థ.. 2010 ధరలకే పనులను చేస్తోంది. పోలవరంలో అంచనా వ్యయం కంటే తక్కువ ధరకే తాము నవయుగకు పనులు అప్పగించామని తెదేపా ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు నవయుగ కన్నా.. తక్కువకు చేసే అవకాశం ఉందా లేదా అన్నది ప్రధానమైన అంశం. కొత్త టెండర్లలో నవయుగకు కూడా పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఇదీ చదవండి: "మీరు టెండర్లు రద్దు చేస్తే..మేము డబ్బులివ్వాలా..?" పోలవరం అథారిటీ