Tirupati District Farmers Affected by Fengal Cyclone in AP : ఫెయింజల్ తుపాను తీరం దాటినా తిరుపతి జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపింది. గత మూడు రోజులుగా మోస్తరుగా పడ్డ వర్షాలు సోమవారం అర్ధరాత్రి దాటాక జిల్లాలోని పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పంట నీట మునిగింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీట మునిగిన పంటలు : జిల్లాలోని 15 మండలాల పరిధిలో 170 గ్రామాల్లో 1806 మంది రైతన్నలు సాగు చేసిన 912 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీ కృష్ణ తెలిపారు. జిల్లాలో 96.80 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం సంభవించింది. పది మండలాల పరిధిలో 38 గ్రామాల్లో 182 మంది సాగు చేసిన ఉద్యాన పంటలు బంగాళాదుంప 69 హెక్టార్లు, టమాటా 18.90 హెక్టార్లు, నీట మునిగినట్లు జిల్లా ఉద్యాన శాఖ డీడీ మధుసూదన రెడ్డి తెలిపారు.
రైతులను వణికిస్తున్న ఫెయింజల్ - తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, పెళ్లకూరు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వరి నార్లు నీటిలో మునుగుతున్నాయి. కొన్ని చోట్ల నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం పడింది. నాయుడుపేట పరిసర మండలాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు నీరు పంట పొలాల్లో పారుతోంది. రైతులు పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వర్షంతో ఇంకా ప్రవాహం పెరిగే అవకాశం ఉందని సమాచారం. లోతట్టు ప్రాంతాలు జలమయమం అయ్యాయి. తడ మండలం కాదలూరు సూళ్లూరుపేట మండలాల్లో వరి నాట్లు నీట మునిగాయి.
తెగిన రామాపురం చెరువు కట్ట : శ్రీకాళహస్తి మండలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. రామాపురం చెరువుకి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో కట్ట తెగి నీరు పొలాల మీద ప్రవహించింది. దీంతో దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలు నీట మునిగాయి. సకాలంలో స్పందించిన అధికారులు తెగిన ప్రాంతంలో ఇసుక బస్తాలతో రింగ్ బండ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.