RAINS IN AP: రాష్ట్రంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జలశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు భారీ వర్షాలు పడుతుండడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో కురిసిన వానలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: తెలంగాణ నుంచి వస్తున్న వరద మున్నేరుకు పోటెత్తుతోంది. జిల్లాలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు మండలాల.. పరిధిలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వత్సవాయి మండలం లింగాల వద్ద ఉన్న..... వంతెన ఆనుకొని వరద వెళ్తోంది. ఎగువ నుంచి ప్రవాహం పెరిగితే... వంతెనపై రాకపోకలు నిలిపిసే అవకాశం ఉంది. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద 10.5 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండగా 27 వేల క్యూసెక్కులు కృష్ణా నదికి వదులుతున్నారు. మున్నేరు పరివాహక గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు అప్రమత్తంయ్యారు. ఎవరూ వాగులోకి దిగవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు: ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గోదావరి ఒడ్డున ఉన్న గండి పోచమ్మ ఆలయం నీట మునిగింది. గోపురం వరకు వరద రావడంతో ఆలయ ప్రాంగణమంతా నీరు చేరింది. పోలవరం ప్రాజెక్ట్ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి కాకపోవడంతోనే పోచమ్మ ఆలయం నీటిలో మునిగిపోయిందని భక్తుల ఆవేదన చెందుతున్నారు. ఎవరు ఆలయ పరిసరాల్లో ఉండకుండా దేవాలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.
గోదావరి వరద కారణంగా నెల్లిపాక, లక్ష్మీపురం 11 కేవీ లైన్ ఫీడర్లు నీటమునిగాయి. నెల్లిపాక నుంచి బండిరేవు వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చోడవరం, నెల్లిపాక, చింతూరు మార్గంలో విద్యుత్ నిలిపివేశారు. వరద 2 అడుగుల మేర తగ్గితే విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది చర్యలు చేపట్టనున్నారు.
- గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రంపచోడవరం మండలం భూపతి పాలెం జలాశయం, ముసురుమిల్లి జలాశయం, మద్దిగడ్డ, సూరంపాలెం జలాశయాలు నీటితో నిండాయి. దీంతో గిరిజనులు లోతట్టు ప్రాంతాలలో బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే జలాశయాలనుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: