పరిషత్ ఎన్నికల ఫలితాల్లోనూ వైకాపా అరాచకాలకు పాల్పడిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu on Parishad Elections) ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా హిర మండలం జడ్పీటీసీగా తెదేపా అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు గెలిచినట్లు ప్రకటించిన తర్వాత..నిబంధనలకు విరుద్ధంగా రీకౌంటింగ్‌కు అనుమతిచ్చారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా జూటూరు ఎంపీటీసీగా తెదేపా అభ్యర్థి నాగేశ్వరరెడ్డి గెలిచినట్లు రెండుసార్లు లెక్కించినప్పుడు తేలినా..మరోసారి రీకౌంటింగ్ నిర్వహించి వైకాపా అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించటం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు. అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవన్నారు. ఆ రెండు స్థానాల్లో తెదేపా అభ్యర్థుల్ని విజేతలుగా ప్రకటించాలని ఎస్ఈసీని (SEC) చంద్రబాబు డిమాండ్ చేశారు.
విజేతలను అభినందించిన చంద్రబాబు
పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన తెదేపా అభ్యర్థులను చంద్రబాబు అభినందించారు. ఎన్టీఆర్ భవన్లో వివిధ స్థానాల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు చంద్రబాబును కలిశారు. అధికార పార్టీ అరాచకాలను రానున్న రోజుల్లోనూ ధీటుగా ఎదుర్కోవాలని వారికి సూచించారు. ఎమ్మెల్యేగా జోగి రమేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడనలో జెడ్పీటీసీగా విజయం సాధించిన నగేశ్‌కు చంద్రబాబు ఫోన్ చేసి అభినందించారు.
ఇదీ చదవండి
STUDENTS PROTEST: మహారాజా కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన