ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తాము పోరాడతామని భాజపా నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. పోరాట కార్యాచరణపై ఈనెల 26న ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలిపారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు. రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. భాజపాకు రాష్ట్రంలో అధికారం అప్పగిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతిలో జరిగిన సమావేశంలో 2024 నాటికి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా పార్టీ అభివృద్ధి ప్రణాళికపై మార్గదర్శనం చేసినట్లు చెప్పారు.
అమరావతి రాజధానిగా కొనసాగాలన్నదే తమ ఆకాంక్షని.. అందుకే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేసి.. నిర్మాణాలు చేపడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఇప్పటికే మంగళగిరిలో జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. అనంతపురం నుంచి అమరావతి వరకు ఆరు వరుసల రహదారి మంజూరైందని.. కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం నుంచి రాజధానికి వంతెన నిర్మాణం మొదలు కావడం అమరావతినే రాజధానిగా ఉంచాలనే తమ బలమైన అభీష్టానికి నిదర్శనంగా ఉదహరించారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అభివృద్ధిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని.. ఇంకా మరింత సాయం అందించేందుకు సానుకూల స్పందన కనబరిచినట్లు వెల్లడించారు.
"ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడతాం. ఇందుకు తగ్గ కార్యాచరణకు ఈనెల 26న ప్రత్యేకంగా సమావేశమవుతాం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో భాజపాకు అధికారమిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మించి చూపిస్తాం. ఎయిమ్స్, ఆరు లైన్ల రహదారి, వంతెనలు ఇవన్నీ రాజధానికి ఆధారాలు. కృష్ణానదిపై మరో వంతెన నిర్మిస్తాం. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నాం. అవసరమైన సమయంలో యాత్రలో కూడా పాల్గొంటాం. ప్రత్యేక హోదా కంటే మించిన ప్రత్యేకతతో రాష్ట్రాన్ని కేంద్రం చూస్తోంది. అమిత్‌షాతో జరిగిన సమావేశంలో ప్రభుత్వ అరాచకాలను వివరించాం. రాష్ట్రానికి సంబంధించిన హామీల అమలు కోసం త్వరలో దిల్లీ రావాలని అమిత్‌షా చెప్పారు. త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తాం" - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.
ఇదీ చదవండి : CM JAGAN SERIOUS: రహదారి వెంట దుర్వాసన.. ముఖ్యమంత్రి సీరియస్