కడప జిల్లా పలసపాడు మండలం మహానంది పల్లె గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సుబ్బమ్మ(85) నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కోడలిపై అలిగిన వృద్ధురాలు ఎవరికీ చెప్పకుండా.. బయటకు వచ్చిన ఆమె వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ భద్రాచలం క్షేత్రానికి చేరుకుంది. అక్కడ రెండేళ్లపాటు ఉంది. తర్వాత.. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వెళ్లింది. గత ఏడాదిన్నరగా ఆ గ్రామంలోనే యాచిస్తూ స్థానికంగా ఉన్న బస్ షెల్టర్లులో తల దాచుకుంటోంది. గత ఏడాది కొవిడ్ సమయంలో.. ఈ ఏడాది ఆమె పలు జాగ్రత్తలు తీసుకుంటూ యాచిస్తూ పొట్ట నింపుకుంది.
మాజీ సర్పంచ్ కృషితో..
ఆమెను గత కొంత కాలంగా పరిశీలిస్తున్న మాజీ సర్పంచ్ జిల్లాపల్లి సుధీర్ బాబు ఆమె గురించి ఆరా తీశాడు. ఆమెతో పలుమార్లు మాట్లాడి చిరునామా తెలుసుకున్నారు. కొవిడ్ రెండో దశకు ముందు ఆమెను స్వగ్రామానికి తిరిగి పంపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో ఆమె ఫోటో తీసుకొని కడప జిల్లాలోని తన మిత్రులకు పంపించి ఆ సర్పంచ్ విచారణ చేశారు. వారి ద్వారా మహానందిపల్లెలోని సుబ్బమ్మ మనవడు పెద్దిరెడ్డి నారాయణరెడ్డికి వాట్సప్ ద్వారా ఆమె ఫోటో పంపి ఆమె పెనుగంచిప్రోలులో ఉన్న విషయాన్ని తెలిపారు.
స్పందించిన కుటుంబసభ్యులు..
వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు తిరిగి సదరు సర్పంచ్ సుధీర్ బాబుకు ఫోన్ చేసి.. సుబ్బమ్మ వారి గ్రామంలోనే ఉందని నిర్ధారించుకున్నారు. సుబ్బమ్మ కొడుకు పెద్దిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, మనవడు నారాయణ రెడ్డి ఇద్దరు కలిసి సుబ్బమ్మ వద్దకు వెళ్లారు. వారిని గుర్తుపట్టిన వృద్ధురాలు ఒక్కసారిగా బోరున విలపించింది. నాలుగేళ్లుగా దూరమైన అమ్మను తమకు దగ్గర చేసిన సుధీర్ బాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
సుబ్బమ్మ కొడుకు వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిన ఏడాది తర్వాత తండ్రి చలమారెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడని అప్పటి నుంచి అమ్మ కోసం రాష్ట్రమంతా విస్తృతంగా గాలింపు చేశామన్నారు. నిన్నటి వరకు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఇంతలో ఆమె తమ వద్దకు చేరడం ఎంతో ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె దాచుకున్న రూ. 85 వేల డబ్బును స్థానికులు సుబ్బమ్మకు తిరిగి ఇచ్చారు.
ఇవీ చదవండి: