రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో విద్యా సంవత్సరం ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు.. తరగతులు ఏ విధంగా కొనసాగించాలనే సందిగ్ధంలో పడ్డాయి. నెల్లూరు జిల్లాలో కళాశాలల అధ్యాపకులు.. ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ పేరుతో సమావేశాలు నిర్వహించి, భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆన్ లైన్ విద్య తప్పదని అభిప్రాయపడుతున్నారు. 70 శాతం ఆన్ లైన్ పాఠాలు, 30 శాతం తరగతిగది బోధనతో ఈ విద్యా సంవత్సరాన్ని గట్టెక్కించాలని నిర్ణయించారు.
రెండు విభాగాల్లో తరగతులు
ఉదయం, సాయంత్రం రెండు విభాగాలుగా విద్యార్థులను విభజించి భౌతిక దూరం పాటిస్తూ తరగతి గదిలో బోధన సాగించాలన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠ్యాంశాల వివరాలు అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆగస్టు 8న ఇంటర్, ఆగష్టు 15వ తేదీ తర్వాత డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
లైవ్ లో పాఠాలు
ఆన్ లైన్ లో బోధనపై విద్యార్థులు అంత శ్రద్ధచూపడంలేదని అధ్యాపకులు అంటున్నారు. ఆన్ లైన్ లో లైవ్ విధానంలోనే బోధన సాగాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఆన్ లైన్ విద్యను ఏ విధంగా కొనసాగిస్తున్నారో ప్రభుత్వం అధ్యయనం చేయాలని కోరుతున్నారు.
ట్యాబ్ లు, ఫోన్లు అందించాలి
ఆన్ లైన్ విద్యలో నైపుణ్యాలు పెంచుకునేందుకు విద్యార్థులకు ఇదో మంచి అవకాశం అంటున్నారు. ఇంటర్ నెట్ సదుపాయం కల్పించి, దూరదర్శన్, సప్తగిరి ఛానళ్లలలో కళాశాల విద్యార్థులకు నిపుణుల చేత బోధన కొనసాగించాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ట్యాబ్ లు, ఆండ్రాయిడ్ ఫోన్లు అందజేయాలంటున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని నిపుణులు కోరుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి : చీరాల దళిత యువకుడి మృతి....దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం