కరోనాతో కన్నుమూసినవారి అంత్యక్రియలు నిర్వహించలేక కుటుంబీకులు అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణనాతీతం. కరోనాతో మరణించిన వారు అనాథల్లాగా వెళ్లకూడదని.. భావించిన గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారానికి చెందిన యువత.. అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను తీసుకున్నారు. ఇందుకోసం ఒక అంబులెన్స్‌తో పాటు.. 10 మంది కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. కులమతాలకు అతీతంగా కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
ఏటీ అగ్రహారానికి చెందిన ముజీబ్ బాషా.. ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగి. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తీసుకువెళ్లడానికి కుటుంబసభ్యులు ముందుకు రావడం లేదని పత్రికల్లో, టీవీల్లో చూశాడు. వెంటనే అతని స్నేహితులతో కలిసి అంత్య క్రియలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తున్నానని చెబుతున్నాడు.
కరోనా విపత్కర పరిస్థితులను చూసిన ఆ పది మంది మిత్రులు.. అంబులెన్స్ ద్వారా మృతదేహాలను తరలిస్తున్నారు. చనిపోయిన వ్యక్తులను సంతోషంగా పంపించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఇప్పటి వరకు 29 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు చెబుతున్నారు. కరోనాతో చనిపోయినవారి వద్దకు రక్త సంబంధికులే వదిలివెళ్తున్న సమయంలో యువత చూపిస్తున్న చొరవ పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: