రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పలు చారిత్రక ప్రదేశాలను పునరుద్ధరణ పనులు చేపట్టారు. వీటిలో భాగంగా గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని కొండవీడు కోటకు మెరుగులుదిద్దారు.
తెలుగు నేలపై కొండవీడు కోటకు ఓ ప్రత్యేక స్థానముంది. చాలా సినిమాలు, నాటకాల్లో ఈ కోట చరిత్ర తరచూ వినిపిస్తునే ఉంటుంది. కొండవీడు ప్రాంతంలో ఉన్న ఈ దుర్గం ఎత్తు సుమారు వంద అడుగులు. ఈ కోటను కొండవీడు రెడ్డి రాజులు శత్రుదుర్భేధ్యంగా నిర్మించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెడ్డిరాజులు నిర్మించిన 80 పైగా కట్టడాల్లో ఇదొకటి. కొండ చుట్టూ ఉన్న రాతిగోడ, కోట బురుజులు, ఆలయాలు, సుందర ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
కొంటవీడు కోటలో వైష్ణవ, శైవ దేవాలయాలు, సభా మంటపాలు, మసీదులు ఉన్నాయి. కొండ దిగువ భాగంలో కత్తుల బావి ఉంది. కట్టుదిట్ట భద్రతతో నిర్మించిన ఈ కోటను జయించడానికి శ్రీకృష్ణదేవరాయలు చాలా శ్రమించారని చరిత్ర చెబుతోంది. ఇంత చారిత్రక వైభవం ఉన్న ఈ కోటను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. 2014 నుంచి కోట పురోగతి పనులు జోరందుకున్నాయి. కోట అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించింది.
కొండ దిగువ నుంచి పై వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డు నిర్మించారు. కొండ పైభాగంలో ఉన్న చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు.కొండవీడు అభివృద్ధి పనులు శిథిలావస్థకు చేరుకున్న శివాలయం, లక్ష్మీనరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలను పునరుద్ధరిస్తున్నారు. సందర్శకుల కోసం కొండపై జంతు ప్రదర్శనశాల, రిసార్టులు ఏర్పాటుచేస్తున్నారు. కొండ పైనున్న అరుదైన వృక్షసంపదను తిలకించడానికి విద్యార్థులు, పరిశోధకులు తరలివస్తున్నారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గ పరిధిలో ఉన్న కోట అభివృద్ధి పనులపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంగా ఈ నెల 17, 18 తేదీల్లో ఉత్సవాల నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు.
కొండవీడు కోట ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా హెలీ రైడింగ్, వాటర్ రైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్లు, పారా గ్లైడింగ్, జిప్ లైనర్, రాక్ క్లైంబింగ్, బర్మా బ్రిడ్జ్ వంటి వినోద, సాహస క్రీడలను ఏర్పాటుచేశారు. లేజర్ లైటింగ్, విద్యుద్దీపాల అలంకృతులతో కోట మిరుమిట్లుగొలుపనుంది. సినీ, సిరియల్ కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రెండ్రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలతో కొండవీడు ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పుల్లారావు తెలిపారు. చివరి రోజు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.