రాజధాని అమరావతిని మార్చాలనుకోవడం వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. రాజధాని పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావంగా గుంటూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిరసన నిర్వహించారు. అమరావతి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని.. ఈ విషయం ప్రజలందరికీ అర్థం అవుతోందని చెప్పారు.
అమరావతిపై భాజపా ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. సీఎం జగన్ అమరావతి విధ్వంసానికి పూనుకున్నారని విమర్శించారు. మే నెల ముందే చెల్లించాల్సిన కౌలును ఇప్పటివరకూ చెల్లించలేదన్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఇస్తామని చెప్పిన పింఛన్లు ఇవ్వడంలేదని ఆక్షేపించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.
అమరావతి రాజధాని తరలించాలనుకోవడం కలగానే మిగిలిపోతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
సమస్యకు పరిష్కారం వెతుక్కున్నారు.. సొంతంగా రోడ్డు నిర్మించారు