రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలకు ఆర్థిక సాయం అందించాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించడమే కాక.. మరో 13 వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. పాత వైద్య కళాశాలల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం సుమారు రూ.13,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు విజయసాయిరెడ్డి లేఖలో తెలిపారు. ఇందుకు కేంద్రం ఆర్థిక సాయం అవసరమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత టైర్ 1 నగరాలు లేనందున సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రైవేట్ వైద్య రంగం ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
కొవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల వైద్య సేవల రంగాన్ని త్వరితగతిన పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని లేఖలో వివరించారు. వైద్య సేవల రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం జిల్లాల వారీగా అమలు చేస్తున్న పథకం కింద తగినంత ఆర్థిక సాయం పొందడంలో కూడా.. రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని చెప్పారు.
ఆరోగ్య రంగంలో జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు లేఖలో వివరించారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు తగినంతగా ఆర్థిక సాయం చేయాలని తన లేఖలో కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: