పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 15న కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. సుప్రీంకోర్టు నుంచి ఇంకా ఆమోదం రాకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. 15న ఇళ్ల పట్టాల పంపిణీ జరగడం లేదని ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ బుధవారం ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. తేదీ మారుతుందని, త్వరలోనే ఆ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మరో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా సుప్రీంకోర్టు అనుమతించాకే పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. వివిధ కారణాల వల్ల ఇప్పటికి మూడుసార్లు ఈ కార్యక్రమం వాయిదా పడింది. మొదట ఉగాదికే పట్టాలివ్వాలని ప్రభుత్వం భావించింది. తర్వాత ఏప్రిల్ 14కు వాయిదాపడింది. అప్పుడూ సాధ్యం కాకపోవడంతో, జులై 8న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజు నిర్వహించాలని అనుకుంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఆగస్టు 15కి వాయిదా పడింది. బుధవారానికి కూడా కోర్టు నుంచి అనుమతి రాకపోవడంతో కార్యక్రమాన్ని మరోసారి వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సుప్రీం ఆమోదించాకే పట్టాలు: నారాయణస్వామి
చిత్తూరు కలెక్టరేట్: సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన తర్వాతే రాష్ట్రంలో ఇంటిపట్టాల పంపిణీ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి స్పష్టం చేశారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే శ్రీనివాసులుతో కలిసి బుధవారం ఆయన చిత్తూరులో విలేకర్లతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన మనుషులతో కేసులు వేయిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: