STUDY CIRCLE: తెలంగాణలో కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లాకో సంక్షేమ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కేంద్రంలో వంద మందికి వసతితో కూడిన శిక్షణ అందించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల వారీగా ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వీలైనంత త్వరగా వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని సంక్షేమ శాఖలను ప్రభుత్వం కోరింది. ఇప్పటికే స్టడీ సర్కిళ్లు ఉన్న జిల్లాలను మినహాయించి, ఈ కేంద్రాలు లేని జిల్లాల్లో కొత్త వాటిని నెలకొల్పనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేలా రాష్ట్రంలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటయ్యాయి. రాజధానిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సివిల్స్ కేంద్రాల్ని మినహాయిస్తే పూర్వ జిల్లా కేంద్రాలకే స్టడీ సర్కిళ్లు పరిమితమయ్యాయి.
గతంలో ఉన్న 10 జిల్లాలు 33 జిల్లాలుగా మారినప్పటికీ కొత్తవి ఏర్పాటు కాలేదు. ఒక్కో కేంద్రంలో 100 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో, ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే నిరుద్యోగ అభ్యర్థుల్లో ఎక్కువ మంది శిక్షణ పొందలేకపోతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాల శిక్షణ కోసం జిల్లాల్లో తాత్కాలిక శిక్షణ కేంద్రాలు నెలకొల్పింది. ఇవి కాకుండా శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఉద్యోగ పోటీ పరీక్షల కోసం నిరంతరం ఫౌండేషన్ కోర్సులు, నైపుణ్య శిక్షణ అందించాలని భావిస్తోంది. ఈ మేరకు పూర్వ జిల్లాల్లోని స్టడీ సర్కిళ్లతో పాటు కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న కేంద్రాలనూ తీర్చిదిద్దాలని ఇటీవల సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటు కోసం జిల్లా స్థాయిలోని సంక్షేమ శాఖలు అవసరమైన స్థలాలు, ప్రభుత్వ భవనాల్ని గుర్తిస్తున్నాయి. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాల్ని ఏర్పాటు చేయనుంది. జనాభా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్సీ సంక్షేమ శాఖతో కలిసి ఎస్సీ, ఎస్టీ సమీకృత కేంద్రాల్ని నెలకొల్పాలని ఆయా శాఖలు భావిస్తున్నాయి. సంక్షేమ శాఖలన్నీ కలిపి స్టడీ కేంద్రాల ప్రతిపాదనలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి పంపించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆమోదం తరువాత వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సంక్షేమ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: