రాష్ట్రం తన అప్పులకు సంబంధించి కేంద్రానికి సమర్పించిన నివేదిక తిరుగు టపాలో వెనక్కి వచ్చినట్లు సమాచారం. తాము కోరిన రీతిలో సమగ్ర వివరాలు లేవని, ఏ అనుబంధం ప్రకారం ఏయే వివరాలు కోరామో వాటిని పొందుపరచలేదని కేంద్ర వ్యయ విభాగం అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. మళ్లీ కొన్ని ప్రశ్నలు సంధిస్తూ.. తాము కోరిన సమగ్ర వివరాలు తీసుకుని నేరుగా రావాలని రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారికి వర్తమానం పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం బహిరంగ మార్కెట్‌లో రుణం తీసుకోవాలంటే కేంద్ర ఆర్థికశాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన ఫార్ములా ప్రకారం.. రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.5 శాతం మేర రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ మొత్తం నుంచి గడిచిన ఆర్థిక సంవత్సరాల్లో అర్హతకు మించి రుణాలు ఏ రూపంలో చేసి ఉన్నా వాటిని మినహాయిస్తామని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ వివిధ రూపాల్లో రుణాలు సమీకరించింది. వాటి సమగ్ర సమాచారాన్ని కేంద్రం కోరింది. వ్యక్తిగత కారణాలతో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వారంపాటు సెలవులో వెళ్లడంతో ప్రస్తుతం ఆ శాఖలోని మరో ముఖ్య అధికారి కేంద్రం కోరిన సమాచారంతో మరో నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆర్థికశాఖకు చెందిన ఇద్దరు కన్సల్టెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
కేంద్ర వ్యయవిభాగం అప్రమత్తం.. ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి సమగ్ర సమాచారం అందించే అవకాశం లేదని ఇప్పటికే కేంద్ర వ్యయ విభాగం ఉన్నతాధికారి సోమనాథ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర వ్యయ నియంత్రణ విభాగానికి లేఖ రాశారు. విదేశీ రుణాలు, నాబార్డు, ఇతర సంస్థలు ఇచ్చిన రుణ సమాచారం కేంద్ర సంస్థల నుంచి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ గ్యారంటీలు, ఇతర ఆస్తుల రూపంలో ప్రభుత్వం నుంచి తనఖా రూపంలో పొంది ఏయే బ్యాంకులు ఎప్పుడు ఎంత మొత్తం ఏపీ కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చాయనే వివరాలు బ్యాంకుల నుంచి తీసుకోవాలని కోరారు. ఇలా ప్రత్యామ్నాయంగా సమాచారం సేకరించకపోతే రాష్ట్రం ఇచ్చే సమాచారం వాస్తవాలను ప్రతిబింబించకపోవచ్చని సైతం అందులో పేర్కొన్న విషయం గమనార్హం.
ఇదీ చదవండి: ఆ వివరాలు పంపాలి... రాష్ట్రాలకూ కేంద్ర వ్యయ విభాగం లేఖ