రాజధాని అమరావతిలో జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రజలు స్పందించాలని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉదాసీనత వల్లే రాజధానిలో ప్రభుత్వ ఆస్తులు అపహరణకు గురి అవుతున్నాయని వెలగపూడి ఐకాస కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నేతలు తెలిపారు.
కరోనా వైరస్‌ని ఎదిరించి ఉద్యమంలో పాల్గొంటున్నా.. ప్రభుత్వం సృష్టించిన వైరస్‌కు మాత్రం విరుగుడు లభించడం లేదని కన్వీనర్ సుధాకర్ ఎద్దేవా చేశారు. అమరావతిలో జరుగుతున్న అన్యాయాన్ని మేథావులు ప్రశ్నించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కల్పవృక్షం లాంటి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
రాజధానిలో దళితులకు వైకాపా అడుగడుగునా అన్యాయం చేస్తోందంటూ ఎస్సీ ఐకాస నేత గడ్డం మార్టిన్ ఆరోపించారు. తాడికొండ, మంగళగిరి శాసనసభ్యులు అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో 41 ప్రకారం తమ అవసరాలకు కోసం భూములు అమ్ముకోవటాన్ని నేరమని వైకాపా ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. భూములు కొనుగోలు చేసిన వారిని నోటీసుల పేరుతో వేధించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి అమరావతిలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి