కొవిడ్ ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. నేటి నుంచి ఈనెల 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు.. 10 లక్షలు రూపాయల చొప్పున, కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయినవారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ను ప్రభుత్వం ముందు నేతలు ఉంచనున్నారు. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా తాహశీల్దార్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రాల అందజేయనున్నారు.
ప్రభుత్వం చెబుతున్న కొవిడ్ మరణాలకు, వాస్తవంలో సంభవిస్తున్నవాటికి ఎక్కడా పొంతన లేదని తెదేపా నేతలు అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు 4 రెట్లు అధికంగానే పాజిటివ్ కేసులు, మరణాలు సంభవించాయని ఆరోపించారు. పేద - మధ్యతరగతి కుటుంబాలు కరోనా చికిత్స కోసం అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకొని ఆర్థికంగా చితికిపోగా... పండించిన ఉత్పత్తులు కొనేవారు లేక వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రభుత్వం దృష్టికి ఈ నిరసనలతో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అప్పులు, ధరలు, పన్నుల రూపంలో ప్రతి కుటుంబంపైనా వైకాపా ప్రభుత్వం 2 లక్షల 50 వేల రూపాయల చొప్పున భారం మోపిందని నేతలు మండిపడుతున్నారు. వీటన్నింటికి సంబంధించి ప్రజల తరపున 10 డిమాండ్లు ఉంచుతూ దశల వారీ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఇదీ చదవండి:
విద్యా సంవత్సరం వృథాపై ... నేడు నారా లోకేశ్ వర్చువల్ సమావేశం