జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ సర్వనాశనమైందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాలు, అంతులేని అవినీతి కోసం.. విద్యార్థుల భవిష్యత్ ను జగన్ రెడ్డి ప్రశ్నార్థకం చేస్తున్నారని మండి పడ్డారు. 2 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు అప్పు కోసం.. రాష్ట్ర విద్యా వ్యవస్థను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు.
మూడేళ్లుగా రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని పట్టాభిరామ్ విమర్శించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఎన్ రోల్ మెంట్ 2 లక్షల 80వేలకు తగ్గిపోయిందని సమగ్ర శిక్షా అభియాన్ నివేదికలో స్పష్టం చేయడంపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలో చెప్పినట్టు 10వ తరగతిలో 31.3 శాతం డ్రాప్అవుట్ రేటు ఉండటమే విద్యా వ్యవస్థలో జగన్ రెడ్డి సాధించిన ప్రగతి అని ఎద్దేవా చేశారు.
ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడానికి.. 51 వేల టీచర్ పోస్టులు ఖాళీగా పడిఉండటానికి ప్రపంచబ్యాంక్ పెట్టిన రుణ షరతు కారణం కాదా? అని నిలదీశారు. విద్యారంగాన్ని భ్రష్టుపట్టించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంగా ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టాభిరామ్ డిమాండ్‌చేశారు.