ఇసుక కొరత విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ...రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. భవననిర్మాణకారులు, కూలీలు సహా గుత్తేదార్లు ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం నేతలు వారికి సంఘీభావం ప్రకటించారు. ఇసుక లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తిండి లేక ఇబ్బందులు పడుతున్నామంటూ నినాదాలు చేశారు.
గుంటూరు నెహ్రూనగర్ కూడలి వద్ద తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇసుక లేకపోవటంతో నిర్మాణ రంగం స్తబ్దుగా మారిందని.... భవన నిర్మాణ కార్మికులకు పనిలేక ఇబ్బందులు పడుతున్నారన్నారని తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రాసాద్ అన్నారు. కొత్తపాలసీ పేరుతో ఆలస్యం చేయటం సరికాదన్నారు. ప్రభుత్వం ఇసుక పాలసీపై సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలన లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
కృష్ణాజిల్లా నందిగామలో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ భవననిర్మాణ కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలోచేపట్టిన ఈ నిరసన తెదేపా నేతలు మాట్లాడుతూ బస్తా ఇసుక... 150 రూపాయలు పలుకుతుందన్నారు. దీని వలన భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోలుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలోనూ తెలుగుతమ్ముళ్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు సాగాయి.