YSR JALAKALA SCHEME: జలకళ పథకం బిల్లులు పెండింగ్.. బోర్ల తవ్వకాల కోసం రైతుల నిరీక్షణ - Bills pending jalakala scheme contractors
YSR JALAKALA SCHEME: వైఎస్సార్ జలకళ పథకం ముందుకు కదలడం లేదు. అన్నదాతల నుంచి సానుకూల స్పందన ఉన్నా....గుత్తేదార్లకు బకాయిల చెల్లింపులో జాప్యంతో చాలా చోట్ల పనులు నిలిచిపోయాయి. అతికొద్ది చోట్ల మాత్రమే బోర్లు తవ్వుతున్నారు. సర్వే పూర్తిలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతోంది.
![YSR JALAKALA SCHEME: జలకళ పథకం బిల్లులు పెండింగ్.. బోర్ల తవ్వకాల కోసం రైతుల నిరీక్షణ ysr jalakala scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13889560-1040-13889560-1639350342749.jpg?imwidth=3840)
YSR JALAKALA SCHEME: రైతుల భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వే వైఎస్సార్ జలకళ పథకం అమలు ఒకడుగు ముందుకు, రెండడుగుల వెనక్కి అన్నట్లు తయారైంది. రైతుల నుంచి స్పందన బాగున్నా అదే స్థాయిలో బోర్లు తవ్వడం లేదు. వీటిని తవ్వే గుత్తేదారు సంస్థలకు 50 కోట్లకుపైగా బిల్లులు చెల్లించాలి. మొదట్లో ఉత్సాహం చూపిన గుత్తేదారులు..బిల్లుల చెల్లింపులో జాప్యంతో పలు చోట్ల పనులు తాత్కాలికంగా నిలిపేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అధికారుల ఒత్తిడితో ఒకటి, అర బోర్లు తవ్వుతున్నారు. ఈ ఏడాది మే నుంచి గుత్తేదారులకు చెల్లింపులు నిలిచాయి. రైతుల దరఖాస్తులపై జియాలజిస్టులు సర్వే పూర్తి చేయడంలోనూ జాప్యమవుతోంది.
బిల్లుల చెల్లింపులో జాప్యంతో..
క్షేత్రస్థాయిలో వీఆర్వో పరిశీలించి అర్హత కలిగిన రైతుల దరఖాస్తులను డ్వామా సహాయ పథక సంచాలకులకు పంపుతారు. అక్కడ కూడా పరిశీలన పూర్తయ్యాక జియాలజిస్టు సర్వే మొదలవుతుంది. బోరు తవ్వేందుకు ఉన్న అనుకూలతలపై రైతుల భూముల్లో వీరు సర్వే చేసి నివేదిక ఇస్తారు. బోర్లు తవ్వే గుత్తేదారు సంస్థలే అర్హత కలిగిన జియాలజిస్టులతో సర్వే చేయించేలా గ్రామీణాభివృద్ధి శాఖ ఒప్పందం చేసుకుంది. జియాలజిస్టుల కొరత, గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో సర్వే మందకొడిగా సాగుతోంది. రెండు దశల్లో వడపోత తరువాత ఏపీడీల నుంచి గుత్తేదారులకు పంపిన లక్షా54వేల288 దరఖాస్తుల్లో కేవలం 37వేల812 మంది రైతులకు సంబంధించి సర్వే పూర్తైంది. మరో లక్షా 16వేల476 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.
తవ్వినవి 8వేల బోర్లు.. విద్యుత్ కనెక్షన్ ఇచ్చినవి సున్నా..
రైతుల భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వించాలని తొలుత నిర్ణయించిన ప్రభుత్వం తరువాత పంపుసెట్ సమకూర్చి విద్యుత్ కనెక్షన్ కూడా ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8వేల బోర్లు తవ్వినా ఒక్కదానికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదనలపై విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల సర్వే చేసి దాదాపు 300 బోర్లకు సంబంధించి ఎన్ని కిలోమీటర్లలో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమో అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమయ్యే నిధులు గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేస్తే విద్యుత్ సంస్థలు తదుపరి చర్యలు తీసుకోనున్నాయి.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతులకు పంపుసెట్లు పంపిణీ చేయాలి. గుత్తేదారు సంస్థలకు పెండింగు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చెల్లింపుల్లో జాప్యం పనులపై కొంత ప్రభావం చూపినా, ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్ కావడంతో బోర్లు తవ్వే అవకాశం లేదని వివరించారు. సంక్రాంతి తరువాత బోర్లు తవ్వాల్సి ఉన్నందున ఈలోగా బిల్లులు చెల్లిస్తామన్నారు.
ఇదీ చదవండి..
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి.. వైకాపా హానికరం : పవన్