సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో.. సచివాలయంలోని ఓ శాఖలో పనిచేసే ఒకరికి, గుంటూరులోని ఓ శాఖ ప్రధాన కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఇద్దరికి పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో ఉండిపోయిన సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే 227 మంది ఉద్యోగులను ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో బుధవారం అమరావతికి తీసుకొచ్చింది. వారిని నేరుగా తాడేపల్లి సమీపంలోని ఒక కన్వెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్లి, కరోనా నిర్ధరణ పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. అందరూ గురువారం నుంచి విధులకు హాజరవుతున్నారు. కరోనా నిర్ధరణ పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి 11 గంటలకు వెల్లడించింది. సచివాలయంలో ఒప్పంద, పొరుగు వేతన ఉద్యోగులతో కలిపి 2,500 మందికి పైనే ఉన్నారు. వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోమవారం నుంచి వారంపాటు సచివాలయ ఉద్యోగులందరికీ ‘ఇంటి నుంచే పని’ సౌకర్యం కల్పించి, అందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.. ఉన్నతాధికారులను కోరారు. నెగెటివ్ అని తేలిన వారిని విధుల్లోకి అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సీఎం క్యాంపు కార్యాలయ కానిస్టేబుల్‌కు పాజిటివ్
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నాలుగో నంబరు ద్వారం దగ్గర విధి నిర్వహణకు కర్నూలు నుంచి వచ్చిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఒకరికి కరోనా నిర్ధరణ అయింది. నాలుగు రోజుల క్రితం విధి నిర్వహణకు రాగా కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్ అని శనివారం బయటపడింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, మిగిలిన సిబ్బందికి వైద్యపరీక్షలు చేశారు. కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి వచ్చిన పలువురు కానిస్టేబుళ్లకు మంగళగిరి సివిల్ పోలీసు క్వార్టర్స్‌లో వసతి కల్పించారు. కానిస్టేబుల్‌కు కరోనా ఉందని తేలడంతో.. మిగతా వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వైకాపా ఎమ్మెల్యే