వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా - ఉత్తర కోస్తాంధ్రా తీరాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే తూర్పు పడమరల వరకూ మరో ద్రోణి ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా నేడు, రేపు ఉరుములతో కూడిన మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని చాలా చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని స్పష్టం చేశారు. ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒకటీ రెండు చోట్ల.. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ, కర్నూలు,కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
వర్షాలు..
శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దపాడు జాతీయ రహదారి వరదనీటితో నిండిపోయింది. పెద్దపాడు కూడలి నుంచి మారుతీ కార్ల షోరూం వరకు జలమయమైంది. ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పాలకొండ, రేగిడి, మండలాల్లో మోస్తరు వర్షం పడింది. నరసన్నపేట, కోటబొమ్మాళి, వీరఘట్టం, బూర్జ, సీతంపేట మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.
గోడ మార్గమే దిక్కు..
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక పంచాయతీ పీరాపురం గ్రామంలో కురుసిన వర్షాలకు పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికి పాఠశాలకు వెళ్లే రహదారి చెరువులను తలపిస్తుంది. దారిలేక విద్యార్థులు పాఠశాల గోడలు, పిట్ట గోడల మీద నుంచి నడుస్తున్నారు. నాడు నేడు కార్యక్రమంలో భవనాలకు రంగులు వేసే పని మీదే దృష్టి పెట్టారు.. తప్ప పాఠశాలకు వెళ్లే మార్గం మీద, మైదానం మీద దృష్టి పెట్టలేదని పలువురు విమర్శిస్తున్నారు.