ముగిసిన పిటిషనర్ల తరఫు వాదనలు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) పదవీకాలం విషయంలో రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో మంగళవారం హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ఎస్‌ఈసీ, ఎన్నికల సంఘం కార్యదర్శి తదితరుల వాదనల కోసం విచారణ గురువారానికి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, దమ్మాలపాటి శ్రీనివాస్, ఎ.సత్యప్రసాద్, పి.వీరారెడ్డి, న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, నళిన్‌కుమార్, డీవీఎస్‌ఎన్ ప్రసాదబాబు తదితరులు వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రత్యేక పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు కొత్తగా నియమితులయ్యే వారికి వర్తిస్తుంది కానీ.. అప్పటికే పదవిలో ఉన్న రమేశ్‌కుమార్‌కు వర్తించదన్నారు. ముఖ్యకార్యదర్శి, ఆపై స్థాయి అధికారిని ఎస్‌ఈసీగా నియమించేందుకు పాత చట్టంలోనే వెసులుబాటు ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయి అధికారైన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించడానికి చట్టసవరణ చేయాల్సిన అవసరం లేదన్నారు.
పురపాలక చట్టానికి సవరణ అవసరం లేదు
ఎస్‌ఈసీ పదవీకాలం విషయంలో పంచాయతీరాజ్ చట్టానికే సవరణ చేశారు.. పురపాలక చట్టానికి సవరణ అవసరం లేదా అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఒక పిటిషనర్ తరఫు న్యాయవాదులు బదులిస్తూ పురపాలక చట్టంలో ఎస్‌ఈసీ నియామక నిబంధనలు లేవన్నారు. అందువల్ల దానికి సవరణ చేయాల్సిన అవసరం లేదన్నారు.
ఇవీ చదవండి: