రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలను చూస్తున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై వాస్తవాలను తేల్చేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ కీలక ఉత్తర్వు జారీ చేసింది. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో వివరాలను సేకరించి అక్టోబరు 5లోగా నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. ఆలోగా అన్ని జిల్లాల్లో పరిశీలన సాధ్యం కాకపోతే, అప్పటివరకు చేసిన తనిఖీల వివరాలతో మధ్యంతర నివేదిక ఇవ్వాలని సూచించింది. ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలపై గుంటూరు జిల్లా అమరావతి మండలం
ధరణికోటకు చెందిన దండా నాగేంద్ర కుమార్ జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్‌ను ఆశ్రయించారు. జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అశాస్త్రీయంగా ఇసుక అక్రమ తవ్వకాలను జరుపుతోందని, పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. హరిత ట్రైబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడు జస్టిస్ కె.రామకృష్ణన్, నిపుణ సభ్యుడు కె.సత్యగోపాల్‌లతో కూడిన బెంచ్ ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది.
సంయుక్త కమిటీ ఇదే..
అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ విజయవాడ ప్రాంతీయ కార్యాలయ సీనియర్ అధికారి, రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీకి చెందిన సీనియర్ అధికారి, గనులశాఖ సంచాలకుడు సూచించిన సహాయ సంచాలకుల స్థాయికి తగ్గని అధికారి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ అధికారి లేదా శాస్త్రవేత్త ఈ సంయుక్త కమిటీలో సభ్యులుగా ఉండాలని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కమిటీ పరిశీలన నిమిత్తం వెళ్లిన జిల్లాల్లో అక్కడి కలెక్టర్‌ను భాగస్వామిగా చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కమిటీ పరిశీలించాల్సిన అంశాలివీ...
* ఇసుక తవ్వకాల కోసం జేపీ పవర్ వెంచర్స్ పర్యావరణ చట్ట ప్రకారం అనుమతులు, ఆమోదం పొందిందా? లేదా?
* గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
* ఇసుక తవ్వకాల విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ 2016లో ఇచ్చిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా జేపీ సంస్థ విచక్షణారహితంగా, అశాస్త్రీయంగా ఇసుక తవ్వకాలు చేసిందా? లేదా? అనేది తేల్చాలి.
* ఒకవేళ అనుమతులకు మించి అదనంగా తవ్వకాలు చేసిందా? జరిపితే ఎంత మేరకు చేసింది గుర్తించాలి.
*అదనంగా జరిపిన తవ్వకాల విలువ ఎంత? దానికి రాయల్టీ, జరిమానాతో పాటు, పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు ఎంత వ్యయమవుతుంది?
* అక్రమ తవ్వకాలు నిలువరించేందుకు గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పర్యవేక్షణ యంత్రాంగం అనుసరించిందా? లేదా?
* ఈ తనిఖీలు చేసే సంయుక్త కమిటీకి రాష్ట్ర గనులశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ సహాయ సహకారాలు అందించి, తగిన ఏర్పాట్లు చేయాలి. పిటిషనరు సంబంధిత కాపీలను, డాక్యుమెంట్లను వారంలో కమిటీకి అందజేయాలి.
ఇదీ చదవండి: ap capital: ఏపీ రాజధాని విశాఖ కాదు.. కేంద్రం వివరణ