మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఆలయ భూముల విషయంలో మాటల యుద్ధం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఇతర మంత్రులను నియంత్రించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. విజయనగర గజపతిరాజుల దాతృత్వం, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ... 2014లో ఉత్తరాంధ్రలో వైకాపాకు ఎదురైన పరిస్థితి పునరావృతం కాకూడదని ఆశిస్తున్నానని పేర్కొంటూ ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. ‘మాన్సాస్ ట్రస్ట్, సింహాచల ఆలయం కేసుల విషయంలో హైకోర్టులో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు విజయం సాధించినప్పటి నుంచి విశాఖ ఇన్‌ఛార్జి, స్వయం ప్రకటిత ఉత్తరాంధ్ర ప్రతినిధి ఎంపీ విజయసాయిరెడ్డి అడ్డగోలు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. రాజు వందలాది ఎకరాలను దోచుకున్నారని, ఆయనపై గతంలో ఓ ఫోర్జరీ కేసు నమోదైందని చెబుతున్నారు. భూ కబ్జాపై తాత్కాలిక స్టే వచ్చిందని, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేస్తామని మీడియాకు తెలియజేశారు. ఎంపీ అవమానకరమైన వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత మీకు కొన్ని విషయాలను తేటతెల్లం చేయదల్చుకున్నా.
- 14,426.91 ఎకరాలతో మాన్సాస్ ట్రస్టును 1958 నవంబరు 12న స్థాపించారు. భూ గరిష్ట పరిమితి చట్టం (ల్యాండ్ సీలింగ్ యాక్ట్) 1970 ప్రారంభంలో వచ్చింది. ఆ చట్టం రావడానికి ఒక రోజు ముందు ట్రస్టు ఏర్పడిందనే ఆరోపణలు అర్థరహితం. రాజు ఛైర్మన్‌గా ఉండగా నిబంధనలు పాటించకుండా ట్రస్టు భూములను అమ్మేశారనడం సత్యదూరం. అన్ని రకాల అనుమతులతో భీమిలి సమీపంలోని కొత్తవలసలో 36 ఎకరాలకు వుడా ఈ వేలం నిర్వహించింది. ఈ విషయంలోనూ దేవదాయ భూముల అమ్మకపు బహిరంగ వేలానికి హైకోర్టు నుంచి సాధారణ అనుమతులు తీసుకోవడంతో పాటు మాన్సాస్ పబ్లిక్ ఛారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బైలాస్ నుంచి స్పష్టమైన అనుమతులు ఉన్నాయి.
- కొత్తపల్లి వద్ద మాన్సాస్ భూముల్లో ఇసుక మైనింగ్ చేశారనేది సరైనది కాదు. 2017-18లో వచ్చిన వరదలతో ట్రస్టు భూముల్లో కొన్ని మునిగిపోయి ఇసుక మేటలు వేసింది. ఆ భూములను సాగు యోగ్యం చేసుకునేందుకు వీలుగా ఇసుకను తొలగించుకునేందుకు కౌలు రైతులకు అనుమతి ఇచ్చారు. వరదల సమయంలో నేల కోత అడ్డుకునేందుకు ఇసుక అవసరమని ఎంవీజీఆర్ కళాశాల ఇచ్చిన సమగ్ర నివేదికతో దానిని నిలిపివేశారు. 2019-2020లో మరోసారి ఇదే పరిస్థితి తలెత్తడంతో అశోక్‌గజపతి రాజు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, దేవాదాయశాఖ కమిషనరుకు లేఖ రాసినా ఇప్పటివరకు ఆయన ప్రయత్నం ఫలించలేదు.
- పంచ గ్రామాల సెటిల్‌మెంట్ అంశానికి అంతరాయం కలిగిస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి సింహాచల భూములను భక్తులు దేవునికి ఇచ్చారు. వంశపారంపర్య ధర్మకర్తగా, భక్తులు ఇచ్చిన భూములను రక్షించడం ఆయన విధి. దేవస్థానం భూములను ప్రభుత్వం తీసుకుంటే తగిన పరిహారం తీసుకోవడం దోచుకోవడం కిందకు రాదు. ఆ భూముల సెటిల్‌మెంట్‌కు తగిన పరిహారం పొందడమే ఆయన బాధ్యత. మాన్సాస్ ట్రస్టు ప్రాపర్టీ రిజిస్టరును 2010లో నాటి ఈవో అప్‌డేట్ చేశారు. అశోక్ గజపతిరాజు 2016లో ట్రస్టు ఛైర్మన్ అయ్యారు. రిజిస్టరు అప్‌డేట్ చేసేటప్పటికీ ఛైర్మన్ కార్యాలయంలో లేని రాజు దానిని ఎలా ట్యాంపర్ చేస్తారు. ఈ వైఖరి నన్ను కలవరపెడుతోంది.
- లెప్రసీ మిషన్ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చట్టపరంగా చూస్తే ప్రజా ప్రయోజనార్థం ఎవరైనా భూములు దానమిచ్చిన తర్వాత ఆ ప్రయోజనానికి సంబంధించి కార్యక్రమాలు కొనసాగనప్పుడు అవి ఎవరైతే ఇచ్చారో వారికి లేదా వారి వారసులకు దక్కుతాయి. ఆ భూముల దాత అశోక్ గజపతిరాజు తాత అలక్ నారాయణ గజపతిరాజు. అందువల్ల ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. ఆ భూములు అశోక్ గజపతిరాజుకు మాత్రమే కాదు అలక్ నారాయణ గజపతి రాజు వారసులందరికీ సంబంధించినవి’ అని రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: