Karimnagar Nurses Dance: సంగీతానికి చింతకాయలు రాలుతాయో లేదో కానీ రోగుల్లోనూ చలనం ఏర్పడుతుందని నిరూపించింది కరీంనగర్ జిల్లాలో వైద్యులు చేసిన ప్రయత్నం. కేవలం మందులే కాదు. సంగీతపరంగాను వైద్యం అవసరమేనని ఇప్పటితరం వైద్యులు గుర్తిస్తున్నారు. సహజ సిద్ధంగా పేషెంట్‌లో కదలికలు తీసుకువచ్చేందుకు ఇటీవల జనాలను ఉర్రూత లూగించిన సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ రోగుల్లో మానసిక స్థిరత్వం కల్పించడంతో పాటు శరీరంలోను కదలికలను వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని నర్సులు వినూత్నంగా తమ నృత్యాలతో రోగి శరీరంలో స్పందన వచ్చేందుకు ప్రయత్నించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్ జాండిస్ సంబంధిత వ్యాధితో బ్రెయిన్‌కు ఆక్సిజన్ అందకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అతన్ని 25 రోజుల క్రితం ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌కు చికిత్స అందించడంతో ఆరోగ్యం కుదుటపడుతోంది. కళ్లు తెరవడం, కాళ్లు కూడా కదుపుతుండడంతో చేతుల్లోనూ కదలికలు రావాలన్న లక్ష్యంతో నర్సులు సినిమా పాటలతో డ్యాన్సులు చేయడం ఆరంభించారు.
అతని చేతుల్లో చాలినంత శక్తి లేకపోవడం వల్ల శ్రీనివాస్ మానసిక ధృడత్వం రావాలని అప్పుడే కదలిక ప్రారంభం అవుతుందని భావించి ఈ రకమైన చికిత్స చేయడం ఆరంభించారు. నర్సుల ఆటపాటలతో కొంతమేర కదలికలు కూడా ప్రారంభం కావడంతో రోగిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించి సహజసిద్ధమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి: Electricity: విద్యుత్ యూనిట్ గరిష్ఠ ధర రూ.12