రాజధాని వ్యాజ్యాల విచారణ ముగిసేలోపు కార్యాలయాల తరలింపు చేపడితే అధికారులు బాధ్యులవుతారని హైకోర్టు హెచ్చరించింది. రాజధాని తరలింపు, సీఆర్డీయే రద్దు బిల్లులపై రైతులు వేసిన వ్యాజ్యాలన్నింటిపై గురువారం త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. రాజధానిపై నిపుణుల కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, హైపవర్ కమిటీల నివేదికలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు అందజేయాలని ఏజీకి తెలిపింది. తదుపరి విచారణలోపు కార్యాలయాల తరలింపు విషయంలో ప్రభుత్వం చర్యలు చేపడితే తమ దృష్టికి తీసుకురావొచ్చని పిటిషనర్లకు సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
కొంత సమయం వేచి చూద్దాం
శాసన మండలికి బిల్లుల్ని పంపాక ఏమైందని ఏజీ ఎస్. శ్రీరామ్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈనెల 22న శాసనమండలి చైర్మన్... బిల్లుల్ని సెలెక్టు కమిటీకి సిఫారసు చేశారని బదులిచ్చారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... బిల్లులు చట్టరూపం దాల్చలేదు కాబట్టి కొంత సమయం వేచి చూద్దామని పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ... వ్యాజ్యాలపై విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. బిల్లులు చట్ట రూపం దాల్చాక వ్యాజ్యాలన్నింటిని కలిసి విచారణ జరుపుదామని ధర్మాసనం ప్రతిపాదించింది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాక నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. సెలెక్టు కమిటీ నిర్ణయానికి గరిష్ఠంగా మూడు నెలల గడువుంటుందని రోహత్గీ తెలిపారు. బిల్లులు ఏ రూపంలో మారతాయో తమకు తెలియదన్నారు. వ్యాజ్యాలపై విచారణను మూడు వారాలకు వాయిదా వేయాలని కోరారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా వేశారు. ఈ సందర్భంలో న్యాయవాదులు స్పందిస్తూ కమిటీ నివేదికలను బహిర్గతం చేయకుండా గోప్యత పాటిస్తున్నారన్నారు. ఆ నివేదిక ప్రతుల్ని పిటిషనర్లకు అందజేయాలని ఏజీకి కోర్టు సూచించింది. హైకోర్టులో వాదనలను వినేందుకు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి, తెదేపా ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు.
ఇదీ చదవండి:ఈ మండలి మనకు అవసరమా..?: సీఎం జగన్