Kakinada Teacher Sexually Assaulted Students : గురువు అంటే తండ్రిలాంటివాడు విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. అలాంటిది కొందరు గాడి తప్పుతున్నారు. విద్యార్థినులపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అభం, శుభం ఎరుగని పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించే పేరిట వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. తాజాగా పాఠాలు చెప్పాల్సిన గురువే పాడు పని చేశాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కాకినాడలో జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కొన్ని రోజులుగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విషయం ఎవరికి చెప్పాలో తెలియక ఇన్నాళ్లూ వారంతా లోలోన మదనపడ్డారు. ఇంతలో బడిలో నిర్వహించిన 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్'పై అవగాహన సదస్సు ఆ పిల్లలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. వక్రబుద్ధి ఉన్న ఉపాధ్యాయుడిని పోలీసులకు పట్టించింది. కాకినాడ ఒకటో పట్టణ సీఐ ఎం.నాగదుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం
School Teacher Sexual Harassment : కాకినాడలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్'పై వన్‌టౌన్ మహిళా పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆరో తరగతి విద్యార్థినులు కొంతమంది సదస్సుకు వచ్చిన మహిళా పోలీసు వద్దకు వచ్చి 'అక్కా లెక్కల మాస్టారు శ్రీనివాసరావు మాపై చేతులు వేసి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు' అని చెప్పారు. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులకు తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ సమయంలో ఇంటివద్ద ఉన్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విద్యార్థినుల తల్లిదండ్రులు కొట్టుకుంటూ పాఠశాలకు తీసుకెళ్లారు. ఎంఈఓ వారిని అడ్డుకునేందుకు యత్నించినా వదల్లేదు. వన్‌టౌన్ సీఐ వచ్చి టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయినా తమకు అప్పగించాల్సిందేనని తల్లిదండ్రులు, బంధువులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని సీఐ చెప్పడంతో చివరికి అడ్డుతొలిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు.
హెడ్మాస్టర్ పాడు బుద్ది .. దేహశుద్ధి చేసిన బాలిక తల్లిదండ్రులు