Fire Accident in Secunderabad Club: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు.. 4 గంటల పాటు సిబ్బంది శ్రమించారు. ఏడు అగ్నిమాపక యంత్రాలతో.. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
శనివారం సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ క్లబ్‌ను మూసివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఎగిసిపడిన అగ్నికీలల్లో క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. క్లబ్‌లో అగ్నిప్రమాద కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉత్తర మండల డీసీపీ చందనాదీప్తీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
వారసత్వ సంపద..
Fire Accident in Secunderabad: 1878లో బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ నిర్మించారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్లబ్‌లో.. 5 వేల మందికి పైగా సభ్యత్వం ఉంది. క్లబ్‌లో 250 మంది ఉద్యోగులు, మరో 100 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ క్లబ్‌ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి.. 2017లో పోస్టల్ కవర్ విడుదల చేశారు.