చట్ట ప్రకారం నిబంధనలను రూపొందించకుండా ఆన్‌లైన్ విధానంలో ఇంటర్ ప్రవేశాలను ఎలా నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంటర్ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. గతేడాది ప్రవేశాల విషయంలోనూ ఇదే వ్యవహారాన్ని తాము తప్పుబట్టినట్లు గుర్తు చేసింది. ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ.. ఇది ఐదున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమన్నారు. పూర్తి వివరాల్ని కోర్టు ముందుంచుతూ అఫిడవిట్ దాఖలుకు స్వల్ప వ్యవధి కావాలని కోరారు.
అందుకు అంగీకరించిన హైకోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఆన్‌లైన్ విధానంలో ఇంటర్ ప్రవేశాలు చేపట్టే నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. గతేడాదిలాగే అన్ ఎయిడెడ్ ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు.
ఇదీ చదవండి: varalakshmi vratam: సౌభాగ్యం, సిరిసంపదలిచ్చే శ్రావణలక్ష్మి