స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 50శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కలెక్టర్లను ఆదేశిస్తూ రెండు జీవోలు(559,560)జీవోలను విడుదల చేశారు. కోర్టు తీర్పు వచ్చిన సాయంత్రమే వీటిని రహస్య జీవోలుగా విడుదల చేశారు. ఈనెల 31లోగా ఎన్నికలు నిర్వహించకుంటే 14వ ఆర్థికసంఘం నిధులు కోల్పోయే అవకాశముందని జీవోలో పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఎప్పటిలోగా ఖరారు చేయాలి, గెజిట్ విడుదల తదితర విషయాలను మాత్రం వెల్లడించలేదు. పురపాలక, నగరపాలక సంస్థల్లోనూ రిజర్వేషన్లు 50 శాతంలోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ జీవో గురువారం రావచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి.
రిజర్వేషన్లను ఎవరెవరు ఖరారు చేస్తారంటే?
షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఏ స్థాయి అధికారులు ఖరారు చేయాలో కూడా జీవో(560)లో పేర్కొన్నారు. వార్డు సభ్యులు, సర్పంచి, ఎంపీటీసీ స్థానాలకు ఆర్డీవో రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను కలెక్టర్లు ఖరారు చేయనున్నారు. రెండో దశలో మండల పరిషత్ అధ్యక్షుల(ఎంపీపీ) రిజర్వేషన్లూ కలెక్టర్లే ఖరారు చేస్తారు. జడ్పీ ఛైర్పర్సన్ స్థానాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇవాళ సాయంత్రంలోగా అన్ని స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జిల్లాల వారీగా రిజర్వేషన్ల వివరాలను శుక్రవారం ఎన్నికల సంఘానికి అందజేయనున్నట్లు సమాచారం.