కొవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో నెలల తరబడి బార్లు మూతపడటంతో అక్కడ మిగిలిపోయిన బీర్లను.. బార్ లైసెన్సుదారుల వినతి మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల్లో అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా బీరును తయారీ తేదీ నుంచి ఆరు నెలల్లోపే వినియోగించాలి. ఆ తర్వాత దాన్ని కాలం చెల్లినదిగా భావిస్తారు.
అయితే మార్చిలో లాక్‌డౌన్ విధించే నాటికి బార్లలో అంతకు నెల రోజుల ముందే తెచ్చిపెట్టుకున్న బీర్ల నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. జులై నాటికే వీటికి కాలం చెల్లింది. వీటిని పక్కన పెట్టాల్సిన ఎక్సైజ్‌శాఖ ఆదాయార్జనే లక్ష్యంగా.. వాటి అమ్మకాల కోసం కొత్త మార్గాన్ని వెతికింది. కాలం చెల్లిన బీర్ల నమూనాలను ప్రయోగశాలకు పంపించి అక్కడ విశ్లేషణల్లో వినియోగానికి అనుకూలమని తేలితే దుకాణాల్లో విక్రయించాలని పేర్కొంటూ ఆగస్టు 19న ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొన్ని రోజులుగా ప్రకాశం, కడప, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కాలం చెల్లిన బీర్ల విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుటం, విమర్శలు రావటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంటూ కాలం చెల్లిన బీర్లు విక్రయించొద్దంటూ సోమవారం ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో జాప్యం