Diesel shortage in AP: రాష్ట్రంలో డీజిల్ కొరత మొదలైంది. కొన్ని బంకుల్లో నిల్వల్లేవనే బోర్డులు కన్పిస్తున్నాయి. వాహనదారులు రెండు, మూడు బంకుల చుట్టూ తిరిగి ఎక్కడా దొరక్క.. సమీపంలోని ప్రైవేటు బంకుల్లో లీటరుకు రూ.1 చొప్పున అధికంగా చెల్లించి కొంటున్నారు. వ్యవసాయ పనులు మొదలైన వేళ డీజిల్ కొరతతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంధన కొరతపై కేంద్ర ఇంధన శాఖ, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులకు లేఖలు రాసినా స్పందన కొరవడిందని డీలర్లు వాపోతున్నారు. సమస్య తీవ్రమవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, వినియోగదారుల నుంచి తాము నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,200 ఇంధన రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా పెట్రోలు, డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో అక్కడక్కడా కొరత మొదలైంది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఏలూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల ప్రభుత్వ రంగ ఇంధన డీలర్లకు చెందిన బంకుల వద్ద నిల్వల్లేవనే బోర్డులు కన్పిస్తున్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు.
అరువు లేదు.. అడ్వాన్సు చెల్లిస్తేనే సరకు: కొన్ని ఇంధన సంస్థలు అమ్మకాలు పెంచుకునేందుకు గతంలో పెట్రోలు, డీజిల్‌ను డీలర్లకు అరువుపై సరఫరా చేసేవి. 18% వడ్డీపైనా అందించేవి. దీంతో డీలర్లు తమ వ్యాపార విస్తృతిలో భాగంగా స్కూల్ బస్సులు, పరిశ్రమలకు అరువుపై ఇంధనం ఇచ్చేవారు. అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు పెరగడంతో పెట్రోలు, డీజిల్ సరఫరాపై నష్టాలు అధికమవుతున్నాయని ఇంధన సంస్థలు చెబుతున్నాయి. ధరల పెంపునకు కేంద్రం అనుమతించకపోవడంతో గిట్టుబాటు కావడం లేదంటూ ఇంధన సంస్థలు సరఫరాలో కోత పెడుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. ‘ఎంత ఎక్కువ ఇంధనం సరఫరా చేస్తే అంత నష్టం వస్తోందని, కోత పెట్టడం మినహా మార్గాంతరం లేదని ఇంధన సంస్థలు భావిస్తున్నాయి. అందుకే ముందస్తు అడ్వాన్సు లేనిదే ట్యాంకర్లకు డీజిల్ నింపడం లేదు. డబ్బులు కట్టినా వెంటనే సరఫరా చేయడం లేదు. మరోవైపు మా దగ్గర అరువుపై ఇంధనం పోయించుకున్నవారు డబ్బులివ్వడం లేదు. దీంతో వడ్డీలకు తెచ్చి అడ్వాన్సు కట్టాల్సి వస్తోంది’ అని పెట్రోలు డీలర్ల సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ వివరించారు. గతేడాది జూన్‌లో ఎంత వినియోగించారో అంతకు మించి ఈ నెలలో ఇవ్వలేమని అంటున్నారని చెప్పారు. దీంతో డిమాండుకు అనుగుణంగా అందించలేకపోతున్నామన్నారు.
ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలూ బంకులకే : ఆర్టీసీ, రైల్వేతోపాటు పలు పెద్ద పరిశ్రమలు తమ ఇంధన అవసరాలకు బంకులను ఏర్పాటు చేసుకున్నాయి. వాటికి ఇంధన సంస్థలు నేరుగా సరఫరా చేస్తాయి. అయితే ధరలు పెరగడంతో వాటికి ఇచ్చే డీజిల్ ధరను పెంచాయి. దిల్లీలో పెట్రోలు బంకుల్లో లీటరు డీజిల్ ధర రూ.89.67, సంస్థలకు సరఫరా ధర రూ.126 ఉంది. రాష్ట్రంలోనూ దాదాపు అంతే వ్యత్యాసం ఉంది. దీంతో పెద్ద ఎత్తున డీజిల్ వినియోగించే ఆర్టీసీ వంటి ప్రైవేటు ఖాతాదారులు కూడా పెట్రోలు బంకులకు వెళ్తున్నారు. అక్కడ డిమాండు పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా ఇంధన సంస్థల నుంచి సరఫరా లేకపోవడంతో కొరత తలెత్తుతోంది. కొన్నిచోట్ల ప్రైవేటు బంకుల్లో లీటరుకు రూపాయి చొప్పున అదనంగా చెల్లించి కొంటున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: 117జీవోను రద్దు చేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన..