ఈ చిత్రంలో ముగ్గురు రోగులున్నారు. ఎవరికీ పడక లభించలేదు. నేలపైన ఇద్దరు పడుకుంటే ఇంకొకరు ఓ మూలన సర్దుకున్నారు. కాళ్లు చాపుకోవటానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెలైన్ స్టాండ్ పొడవుగా ఉండటంతో చేతి నరం నుంచి గ్లూకోజ్ ఎక్కించే పరిస్థితి లేదు. దీంతో కాలి నరం వద్ద సూది గుచ్చి ఇలా చికిత్స చేస్తున్నారు. ఇలా అయితే సెలైన్ ఎక్కే వరకు పడుకునే వీలు లేదు. ఎంత కష్టమైనా అలానే కూర్చోవాల్సిందే.
హైదరాబాద్ ఉస్మానియా దవాఖానా దుస్థితికి నిదర్శనమీ చిత్రాలు. సెలైన్ స్టాండులు లాంటివి మీద పడి కొందరికి గాయాలు కూడా అవుతున్నాయి. ఆసుపత్రుల్లో అనేక రకాల ఇన్‌ఫెక్షన్లు ఉంటాయి. దీంతో రోగం తగ్గక పోగా పెరిగే ప్రమాదం ఉంది.
పాత భవనం శిథిలావస్థకు చేరడంతో ఇటీవలి వర్షాలకు భవనం లోపలకు నీళ్లు చేరాయి. దీంతో రోగులు, వైద్యులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఖాళీ చేయించి కులీకుత్బుషా భవనాల్లోకి దాదాపు 600 పడకలు మార్చారు. పాత భవనంలో జనరల్ సర్జరీ, ఆర్థో, సర్జికల్ గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్ వార్డులు ఉండేవి. పది ఆపరేషన్ టేబుల్ కూడా నిర్వహించేవారు. ప్రస్తుతం ఇవన్నీ ఇతర చోట్లకు తరలించారు. కులీకుత్బుషా భవనంపై తాత్కాలిక షెడ్ వేసి అక్కడ 400 పడకలు సర్దుబాటు చేశారు. నర్సింగ్ హాస్టల్‌లో సూపరింటెండెంట్ కార్యాలయం, సెమినార్ హాళ్ల కోసం కేటాయించారు. ప్రస్తుతం ఈ భవనం కూడా బాగా పాత పడింది. చిన్న చినుకు పడితే నీళ్లు లోపలకు వస్తున్నాయి.
ఓపీ నుంచి గాంధీకే..
ఉస్మానియా వేయి పడకలు ఆసుపత్రి అయినా అనధికారికంగా మరో 800 వరకు సర్దుబాటు చేసేవారు. ప్రస్తుతం స్థలాభావంతో కుదరడం లేదు. గతంలో ఓపీకి 2 వేల మంది వస్తే 250-300 వరకు ఆసుపత్రిలో చేరేవారు. ప్రస్తుతం మందులిచ్చి తర్వాత రావాలని, లేదా నేరుగా గాంధీకి వెళ్లాలని సూచిస్తున్నారు.
శస్త్రచికిత్సకూ ఆగాల్సిందే..
గతంలో ఆసుపత్రిలో 30 వరకు ఆపరేషన్ టేబుళ్లుండేవి. రోజుకు ఒక టేబుల్‌పై 2-3 సర్జరీలు చేసేవారు. ప్రస్తుతం 15 మాత్రమే ఉన్నాయి. దీంతో శస్త్రచికిత్సల్లో జాప్యం జరుగుతోంది. కొన్నింటిని వాయిదా వేస్తున్నారు.
ఉన్నంతలోనే నాణ్యంగా..: డాక్టర్ నాగేంద్ర, సూపరింటెండెంట్
పాత భవనం మూత పడటంతో మిగతాచోట్ల పడకలు సర్దుబాటు చేశాం. ఉన్నంతలో రోగులకు నాణ్యమైన చికిత్సలు అందించడానికి ప్రయత్నిస్తున్నాం.
ఈ చిత్రం చూశారా.. ఉస్మానియాలోని ఓ వార్డులో రోగుల దుస్థితి ఇది. చికిత్సల కోసం ఆసుపత్రిలో చేరిన వీరికి పడక లేకపోవడంతో వైద్యులు ఇలా నేలపైనే చికిత్స చేస్తున్నారు. ఒకరు పడుకుంటే మరొకరికి చోటుండదు. పడకలు ఖాళీ అయ్యాక ఇస్తామని సిబ్బంది చెప్పడంతో మూడు రోజులుగా నేలపైనే కూర్చొని నిరీక్షిస్తున్నారు.
ఇది ఉస్మానియాలో ఓ జనరల్ వార్డులో పరిస్థితి. స్థలాభావం వల్ల పక్కపక్కనే మంచాలు వేశారు. వాస్తవానికి కొవిడ్ నేపథ్యంలో కనీసం అరడుగుల దూరం పాటించాలి. ఈ చిత్రం చూస్తే అది ఎక్కడా అమలు కావడం లేదని స్పష్టమవుతోంది. రోగులు, వారి సహాయకులతో వార్డు నిత్యం కిటకిటలాడుతుంది. దీంతో కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం ఉంది.