Command Control Center: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు నాలుగో తేదీన ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. బంజారాహిల్స్‌లో రూ.585 కోట్లతో చేపట్టిన ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో, ఐకానిక్ భవనంగా రూపుదిద్దుకుంటోంది. పనుల తీరు, ప్రారంభోత్సవ సన్నాహాలకు సంబంధించిన డ్రైరన్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీలు డీఎస్‌చౌహాన్, ఎ.ఆర్.శ్రీనివాస్, సంయుక్త కమిషనర్లు ఏవీరంగనాథ్, డాక్టర్ గజరావు భూపాల్, డీసీపీలు జోయల్‌డేవిస్, సునీతారెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు.
రహదారులు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), విద్యుత్‌శాఖ అధికారులతోనూ మాట్లాడారు. జులై 31కల్లా అంతా సిద్ధంచేయాలని కమిషనర్ వారికి సూచించారు. కొత్తగా ప్రారంభమయ్యే కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రజలంతా సందర్శించేందుకు వీలుంది.
19 అంతస్తులున్న ఈ భవనంలో సందర్శకులు 14, 15 అంతస్తుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అక్కడి నుంచి నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు. టికెట్లు కొన్నవారికే అనుమతి ఉంటుంది. ఆరో అంతస్తులోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వచ్చి బయటనుంచి పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను వీక్షించేందుకూ పర్మిషన్ ఇస్తారు.