ETV Bharat / city

రెండున్నర ఏళ్లలో ఆ మూడు పోర్టులు పూర్తికావాలి : సీఎం జగన్ - పారిశ్రామిక కారిడార్లపై సీఎం జగన్ రివ్యూ

రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 3 పోర్టుల నిర్మాణాలు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ,కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సీఎం.. ఎయిర్ పోర్టు నుంచి విశాఖ నగరానికి బీచ్ రోడ్ పూర్తి చేయాలని ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖకు పైపు లైన్‌ ద్వారా తాగునీటి సరఫరా కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక వెంటనే సిద్ధం చేయాలన్నారు. విశాఖకు సంబంధించిన 3 ప్రాజెక్టులు సంక్రాంతికి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Cm jagan
Cm jagan
author img

By

Published : Nov 26, 2020, 3:46 PM IST

Updated : Nov 26, 2020, 7:22 PM IST

రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, మంత్రి గౌతమ్ రెడ్డి, పరిశ్రమలు, ఏపీఐఐసీ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాలు సత్వరమే పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖ సిటీకి త్వరగా చేరుకునేలా బీచ్‌ రోడ్డు నిర్మాణం చేయాలన్నారు. విశాఖపట్నంలో మెట్రో రైల్‌ నిర్మాణం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

మూడు పోర్టులు రెండున్నర ఏళ్లలో

పోలవరం నుంచి విశాఖకు పైపు లైను ద్వారా తాగు నీటి సరఫరా ప్రాధాన్యతా అంశమన్న సీఎం... ఈ పైపులైన్​కు త్వరగా డీపీఆర్‌ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టులు పనులన్నీ రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. 8 ఫిషింగ్‌ హార్బర్లు, కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్​ల నిర్మాణాలు సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మచిలీపట్నం పోర్టుకు వచ్చే ఫిబ్రవరిలో టెండర్లు!

రామాయపట్నం పోర్టుకు డిసెంబర్‌ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామన్న అధికారులు, రామాయపట్నం పోర్టు పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెడతామని తెలిపారు. మొదటి దశలో 4 బెర్తులతో ఏడాదికి 15 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తామని వెల్లడించారు. భావనపాడు పోర్టుకు డిసెంబర్‌ 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, పనులు అప్పగిస్తామన్న అధికారులు...మార్చి 2021 నుంచి పనులు మొదలుపెడతామని తెలిపారు. మొదటి దశలో 4 బెర్తులతో 25 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేస్తామని తెలిపారు. మచిలీపట్నం పోర్టుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 కల్లా టెండర్లు ఖరారు చేసి, ఏప్రిల్, 2021 నుంచి పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మొదటి దశలో 6 బెర్తులతో 26 మిలియన్‌ టన్నుల కార్గో రవాణాకు అవకాశం కల్పిస్తామన్నారు.

ఎయిర్ కార్గో సదుపాయాల పెంపుపై దృష్టి

విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌లోని విశాఖపట్నం నోడ్‌లో అచ్యుతాపురం క్లస్టర్, నక్కపలి క్లస్టర్​లో పనుల తీరును సీఎంకు అధికారులు వివరించారు. రాంబిల్లి ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తద్వారా విశాఖపట్నం పోర్టుపై ఒత్తిడి తగ్గించవచ్చని, కాలుష్యాన్ని కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయన్నారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు నోడ్‌లో కార్యకలాపాలను వివరించిన అధికారులు..ఎయిర్‌ కార్గో అవసరాన్ని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, కడప విమానాశ్రయాల్లో ఎయిర్‌ కార్గో సదుపాయాలను పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.

డీశాలినేషన్ నీరు వినియోగించండి

పరిశ్రమలకు వీలైనంత వరకూ డీశాలినేషన్‌ చేసిన నీటిని వినియోగించేలా చూడాలని సీఎం సూచించారు. లీటరు నీరు 4 పైసలకు మాత్రమే వస్తుందన్న సీఎం..దీని వల్ల తాగునీటిని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పారిశ్రామిక వాడల్లో మురుగునీటి పారిశుద్ధ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి :

వర్షాలు తగ్గగానే వరద నష్టంపై మదింపు: సీఎం జగన్​

Last Updated : Nov 26, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.