ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా కరోనా వేళ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ పరంగా ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు, సూచనలు ఉంచారు. ప్రభుత్వం వీటిపై రాజకీయాలకు అతీతంగా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనా కిట్లు, బ్లీచింగ్ కొనుగోళ్లు, 108వాహనాల్లో అవినీతి క్షమించరానిదన్న చంద్రబాబు... దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. కేంద్రం కరోనా నివారణకు ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్రతిఒక్కరికీ రూ.10లక్షల రూపాయల బీమా వర్తింపచేయటంతో పాటు.. కరోనా వల్ల చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్ల కుటుంబాలకు రూ.10లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్లందరికీ రూ.50లక్షల బీమా వర్తింప చేసి..., ప్రజల ఇబ్బందులు గుర్తించి ప్రతి కుటుంబానికి 5వేల రూపాయలు అందచేయాలని చంద్రబాబు అన్నారు.
మద్యం సేవిస్తే రోగనిరోధక శక్తి తగ్గి కరోనా వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తక్షణమే మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువులు ఇళ్ల వద్దకు పంపించటం, రేషన్‌ను బయోమెట్రిక్ లేకుండా నేరుగా అందించటం లాంటి చర్యలు చేపట్టాలన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకుని పాత శ్లాబ్ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మానవత్వానికే కరోనా పెను సవాలుగా తయారైందన్న చంద్రబాబు.. కరోనా సమయంలో అంతా సమైక్యంగా ఉండి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరారు. కరోనాను జయించటమే ప్రతిఒక్కరి ధ్యేయం కావాలని చంద్రబాబు అన్నారు.
ఇదీ చదవండి: 'అధ్యయనం చేసి.. ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలి'