CBN LETTER: వైకాపా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా, కావాలని తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిందని, డయాఫ్రం వాల్ ఎప్పుడు దెబ్బతిందో కూడా గుర్తించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు 71% పూర్తవగా... వైకాపా ప్రభుత్వం తన అసమర్థ నిర్ణయాలతో అవరోధాలు సృష్టించి ప్రాజెక్టు భవిష్యత్తునే ప్రమాదంలోకి నెట్టేసిందని ఆందోళన వ్యక్తంచేశారు. గుత్తేదారుల్ని మార్చవద్దంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చేసిన సూచనల్ని జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, ఏకపక్షంగా, మొండిగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని అనిశ్చితి నెలకొందని.. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, రాష్ట్రప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ప్రాజెక్టుకు సాంకేతికంగా జరిగిన నష్టంపై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కి చంద్రబాబు బుధవారం లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టుపై వైకాపా ప్రభుత్వానికి కేంద్రం వివిధ సందర్భాల్లో చేసిన సూచనలు, పీపీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల పత్రాలను ఆ లేఖకు జతచేశారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన లోపాలకు కారణాలేంటో గుర్తించాలని, ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.
వరద సమయంలో గాలికొదిలేశారు..
2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును బలిపెట్టడం ప్రారంభించిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ప్రాజెక్టు గుత్తేదారు సంస్థను ప్రభుత్వం మారుస్తుందని 2019 జూన్ 1నే పత్రికల్లో వార్తలు వచ్చాయి. పనులు నిలిపివేయాలని ఆ సంస్థకు వెంటనే ఆదేశాలూ జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పనులు అప్పగించిన సంస్థను తొలగించి రివర్స్ టెండరింగ్ పేరుతో 2019 నవంబరులో మరో సంస్థను ఎంపికచేశారు. జూన్ నుంచి ఆరు నెలలపాటు ప్రాజెక్టులో ఏ పనులూ జరగలేదు. ఆ ఆరు నెలలూ ప్రాజెక్టు ప్రదేశంలో గుత్తేదారు సంస్థ ప్రతినిధులెవరూ లేరు. అప్పటివరకూ పనిచేస్తున్న అధికారుల్ని కూడా ప్రభుత్వం మార్చేసింది. ఆ సమయంలో వరద నియంత్రణ సరిగ్గా చేయకపోవడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. దాన్ని ఒక ప్రముఖ సంస్థ నదీగర్భంలో 40 నుంచి 100 మీటర్ల లోతు వరకు రికార్డు సమయంలో నిర్మించింది. అంత లోతున డయాఫ్రం వాల్ నిర్మించడం దేశంలోనే మొదటిసారి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
పోలవరం అథారిటీ వారించినా..
రాష్ట్రప్రభుత్వ దురుద్దేశపూర్వక నిర్ణయాల్ని అడ్డుకునేందుకు పీపీఏ చాలా ప్రయత్నించిందని, ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా జరుగుతున్న సమయంలో గుత్తేదారును మార్చాల్సిన అవసరం లేదని 2019 ఆగస్టు 13న జరిగిన అత్యవసర సమావేశంలో స్పష్టం చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. తప్పు జరిగిందనడానికి ఆధారాలూ లేవని చెప్పిందన్నారు. ‘గుత్తేదారును మార్చడం వల్ల వ్యయభారం పెరుగుతుందని, ప్రాజెక్టులో జాప్యంతో పాటు, దాని భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేస్తుందని పీపీఏ హెచ్చరించింది. ప్రస్తుత గుత్తేదారును పంపేస్తే... ఆ సంస్థ చేసిన పనుల్లో ఏమైనా లోపాలున్నా చర్యలు తీసుకోలేమని తెలిపింది’ అని చంద్రబాబు వెల్లడించారు. ‘పీపీఏ హెచ్చరికల్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 17న టెండర్ ప్రకటన జారీచేసింది. ప్రాజెక్టు జాప్యమైతే జరిగే నష్టం గురించి ప్రధాన ప్రతిపక్షం తెదేపా చేసిన హెచ్చరికలనూ బేఖాతరు చేసింది’ అని పేర్కొన్నారు.
మాట మారుస్తూనే ఉన్నారు..
వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు గడువును ఎప్పటికప్పుడు మారుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘2021 జూన్‌కే పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. తర్వాత దాన్ని 2021 డిసెంబరుకి, మళ్లీ 2022 జూన్‌కి పొడిగించారు. ఇప్పుడు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమంటున్నారు. ప్రాజెక్టు జాప్యం వల్ల దేశానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, ఆర్ అండ్ ఆర్ వ్యయం పెరగడం ప్రత్యక్షంగా జరిగే నష్టం. ప్రాజెక్టు పూర్తయితే వచ్చే ప్రయోజనాల్లో జాప్యం పరోక్ష నష్టం’ అని తెలిపారు.
పునరావాసం డబ్బూ కాజేశారు
వైకాపా ప్రభుత్వం 2019 జూన్ నుంచి ప్రాజెక్టు ప్రభావిత ప్రజలకు సహాయ, పునరావాస కార్యక్రమాల్ని నిలిపివేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంతకాలం జాప్యం చేయడంతో ఆర్ అండ్ ఆర్ ఖర్చు భారీగా పెరిగిందన్నారు. ప్రాజెక్టు బాధితులకు ఇచ్చే పునరావాస నిధుల్లోనూ అవకతవకలు జరిగాయని, నకిలీ పేర్లతో కొందరు ఆ డబ్బు కాజేశారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం వల్ల ఉత్తరాంధ్రకు తాగునీరు, రాయలసీమకు సాగునీటి సరఫరాపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. నదుల అనుసంధానం, జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులకూ అవరోధం ఏర్పడిందన్నారు.
ఇవీ చదవండి: