పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎడమ ప్రధాన కాలువలోని 5-ఏ ప్యాకేజీ పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎడమ ప్రధాన కాలువ పనులను 8 ప్యాకేజీలుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐదో నెంబర్ ప్యాకేజీని సవీర్ డ్యాం వాటర్ వర్క్స్ కంపెనీకి గతంలో అప్పగించింది. దాదాపు 181 కోట్ల 87 లక్షల రూపాయల విలువైన ఐదో ప్యాకేజీ పనులను ఆ సంస్థ చేపట్టింది. 2018 జూన్-జులైలో... పీఎస్కే-హెయిఎస్ భాగ్యస్వామ్య సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ద్వారా ఆ పనులు దక్కాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ తవ్వకానికి సంబంధించి చేపట్టిన పనుల్లో దాదాపు 64 శాతం మేర... 117 కోట్ల 5 లక్షల రూపాయల విలువైన పనులు పూర్తిచేశారు. ఇంకా 64 కోట్ల 81 లక్షల విలువైన పనులు చేయాల్సివుంది. ఈ మిగిలిన పనులనే రద్దు చేస్తూ జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది. త్వరలోనే ఈ పనులకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో తిరిగి టెండర్లను పిలవనున్నారు.
ఇదీ చదవండి:జెన్కో ఉత్తర్వులు రద్దు... రివర్స్ టెండరింగ్ వద్దు...