విశాఖలో 48 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది: సీఎస్ - cs sahney press meet news on visakha incident
విశాఖలో 48 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని సీఎస్ నీలంసాహ్ని తెలిపారు. ఇప్పటివరకూ 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వివరించారు. గాలిలో స్టైరిన్ శాతం ఎంత ఉందో గమనిస్తున్నట్లు చెప్పారు. పరిస్థితి సద్దుమణిగేవరకూ పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉండాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు.

విశాఖలో ఇప్పటివరకూ 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. గ్యాస్ లీక్ ఘటనపై కలెక్టరేట్లో సీఎస్ అధ్యక్షతను ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో మంత్రులు కన్నబాబు, అవంతి, బొత్స, కృష్ణదాస్, కలెక్టర్ వినయ్‌చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. ఈ దుర్ఘటనలో 12 మంది మరణించారన్న ఆమె.. 454 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధితుల్లో 20 మందికి తీవ్ర అస్వస్థతతో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిశ్రమలో 120 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని.. 48 గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని అన్నారు. నిన్న రాత్రి కూడా రసాయన వాయువు వ్యాప్తి చెందిందని.. వెంటనే సిబ్బంది అప్రమత్తమై పరిస్థితి అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు.
గాలిలో స్టైరిన్ ఎంతశాతం ఉందో గమనిస్తున్నామని సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. ఈ వాయువు వల్ల దీర్ఘకాలిక ప్రభావం ఏమీ ఉండదని తెలుస్తున్నట్లు వివరించారు. మరో 24 గంటలపాటు స్టైరిన్ ట్యాంక్‌పై నీరు చిమ్ముతామని అన్నారు. పరిస్థితి సద్దుమణిగేవరకూ 5 గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉండాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి..