భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ-భీమిలి-భోగాపురం వరకూ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా మంజూరు చేయాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో మంగళవారం సీఎం కలిశారు. ‘విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగం. పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే సరకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుంది. సముద్రతీరాన్ని ఆనుకుని బీచ్ కారిడర్ ప్రాజెక్టుల సమీపం నుంచి వెళుతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి దోహపడుతుంది. విశాఖ నగరంలో వాహనాల రద్దీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆరు వరుసల రహదారి అవసరం...’ అని సీఎం జగన్ వివరించారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపై (డీపీఆర్) కేంద్ర మంత్రితో ఆయన చర్చించారు. అలాగే కత్తిపూడి-ఒంగోలు కారిడర్‌లోని ఎన్‌హెచ్-216 నిర్మాణాన్ని బాపట్లలో నాలుగు వరుసలుగా విస్తరించాలని, విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అంశాన్ని పరిశీలించాలని కోరారు. వివిధ శాఖల సమన్వయంతో ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేస్తామని, ప్రాజెక్టుల ఖర్చు తగ్గించేందుకు వివిధ రకాల మినహాయింపులు ఇస్తామని సీఎం జగన్ తెలిపారు.
ఆర్బీకేలకు సహకరించండి..
రైతులకు అవసరమైన వ్యవసాయ విజ్ఞానాన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా అందించేందుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించాలని కేంద్ర క్రీడలు, సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌కు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి కలిశారు. రాష్ట్రంలో క్రీడా సముదాయాల అభివృద్ధిపై చర్చించారు. అనంతరం కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన నివాసంలో కలిసిన సీఎం జగన్ సాలూరు సమీపంలో నిర్మించనున్న గిరిజన విశ్వ విద్యాలయం పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ విశ్వవిద్యాలయం స్థల మార్పిడికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ విద్యా సంస్థలు తాత్కాలిక భవనాల్లోనే కొనసాగుతున్నాయని, వాటి పనులు వేగవంతం చేయాలని, నైపుణ్యాభివృద్ధి కళాశాలల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి వెంట పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీలు వై.ఎస్.అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వల్లభనేని బాలశౌరి, మార్గాని భరత్ ఉన్నారు. తొలి రోజు ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ, పౌరవిమానయాన శాఖల మంత్రులను కలిశారు.
ముగిసిన సీఎం దిల్లీ పర్యటన
గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటన ముగించుకుని మంగళవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి వెళ్లారు. ఏసీపీ విజయ్‌పాల్, సీఐ శివాజీ బృందం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ వారంలో మరోసారి దిల్లీకి!
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు సీఎం జగన్ ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేకపోవడంతో కలవలేకపోయారు. షాను కలిసేందుకు ఈ వారంలోనే సీఎం మరోసారి దిల్లీ వస్తారని సమాచారం.
ఇదీ చదవండి: