ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదనకు బుధవారం జరిగిన భేటీలో ఆమోదముద్ర వేసింది. అక్రమ రవాణా చేసేవారికి గరిష్ఠంగా రెండేళ్ల వరకు జైలు శిక్షతోపాటు... 2 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ గనుల చట్టంలో సవరణలు ఆమోదించింది. ఇసుక లభ్యత మరింత పెంచేలా గురువారం నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేసింది. 10 రోజుల్లో కొరత పూర్తిగా తీరుస్తామని చెప్పింది.
'ఆంగ్లం' విధానానికి ఆమోదం..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావుల నుంచి వచ్చిన వినతుల మేరకు... ఆంగ్ల మాధ్యమం విషయంలో ముందడుగు వేస్తున్నట్లు భేటీ తర్వాత రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.
పరిహారం పెంపు
వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందే మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని... 10 లక్షలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ‘‘వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా" పథకాన్ని ఈనెల 21న ప్రారంభించాలని నిర్ణయించింది. కాలుష్యం నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామన్న మంత్రివర్గం... పర్యావరణ మేనేజిమెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
మొక్కజొన్న ధరల పతనంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. వారం క్రితం 2200 ఉన్న క్వింటాల్ ధర... ప్రస్తుతం 1500 పడిపోయిందని మంత్రి కన్నబాబు మంత్రివర్గం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి... రైతులు నష్టపోకుండా మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో అనధికారిక లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు–2019ని మంత్రివర్గ ఆమోదించింది. సోలార్ పవర్ పాలసీ, విండ్ పవర్ పాలసీ, ఏపీ విండ్- సోలార్-హైబ్రిడ్ పవర్ పాలసీల సవరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
84 గ్రామ న్యాయాలయాల చట్ట సవరణ, న్యాయవాదుల సంక్షేమ నిధి చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. హోంశాఖలో అదనపు పోస్టుల మంజూరు, 8 దేవస్థానాల ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం, "మున్సిపల్ లా" చట్ట సవరణలు మంత్రివర్గం ఆమోదించింది.
ఇదీ చదవండి : పవన్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోం: బొత్స