ఏపీ ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)-21ను ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈఏపీసెట్‌ను గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు. వైద్యవిద్యలో ప్రవేశాలకోసం జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్ష (నీట్) నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో ‘ఎం’ అనే అక్షరాన్ని తొలగించారు. ఫార్మసీ ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్షద్వారా నిర్వహిస్తున్నందున ‘ఎం’ స్థానంలో ‘పి’ ని చేర్చి ఈఏపీసెట్‌గా మార్పు చేశారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగింది. పాలిటెక్నిక్, అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) పరీక్షలు పూర్తి కానందున మిగతా ఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్, పీజీఈసెట్‌లను సెప్టెంబరు మొదటి, రెండు వారాల్లో నిర్వహించాలని నిర్ణయించారు.
ఇంటర్ వెయిటేజీ తొలగింపు!: ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించే అవకాశం ఉంది. మార్కుల వెయిటేజీపై ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనలు సమర్పించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతోపాటు సీబీఎస్‌ఈ +2 పరీక్షలను రద్దు చేసింది. రాష్ట్రంలో గతేడాది ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ నిర్వహించనందున అనుత్తీర్ణులైన వారికి 35 మార్కులు కలిపారు. ఈ నేపథ్యంలో వెయిటేజీని తొలగించాలని అధికారులు భావిస్తున్నారు.
30శాతం పాఠ్యాంశాల తొలగింపు..: కరోనా కారణంగా ఇంటర్‌లో 30శాతం పాఠ్యాంశాలను తొలగించారు. రెండో సంవత్సరం విద్యార్థులు గతేడాది మొదటి సంవత్సరం పూర్తి పాఠ్యాంశాలను చదవగా.. వారికి రెండో ఏడాది 70శాతం పాఠ్యాంశాలే బోధించారు. దీంతో ప్రథమ సంవత్సరం నుంచి ప్రశ్నలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. తొలగించిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇవ్వరు.
ఇదీ చదవండి:
విశాఖలో కలకలం... కారు బ్యానెట్లో దూరిన పాము!