ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నిరసన బాట పట్టిన రైతుల ఉద్యమం మరో మైలురాయిని చేరింది. అలుపెరగని ఈ అవిశ్రాంత న్యాయ పోరాటం 350వ రోజుకు చేరింది. తమ సమస్యను రాష్ట్రమంతా వినిపించేందుకు.... సందర్భానికి అనుగుణంగా వివిధ రూపాల్లో నిరసన చేపట్టారు. లాఠీ దెబ్బలు తిన్నారు. అవమానాలు ఎదుర్కొన్నారు. ఎండావానలకు ఎదురొడ్డారు. ఇలా ఎన్నో సవాళ్ల మధ్య 3 రాజధానులకు వ్యతిరేకంగా జై అమరావతి అనే నినాదాన్ని మరింత విస్తృతం చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున... సీఎంకు రైతులు తమ నిరసనను తెలియజెప్పేందుకు యత్నించారు. ఆ ప్రయత్నం కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య సీఎం అసెంబ్లీకి వెళ్లడాన్ని తప్పుబట్టిన రైతులు.. ఈ చర్యతో ప్రభుత్వ నిర్ణయం న్యాయమైనది కాదని అర్థం అవుతోందన్నారు. దీక్షా శిబిరాల వైపు చూడడానికి కూడా సీఎం ఇష్టపడటం లేదని నిరాశ వ్యక్తం చేశారు.
ఉద్యమం ప్రారంభించి 350 రోజులైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీల్లో రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం దిగివచ్చి వారితో చర్చలకు సిద్ధమైతే రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.
తమ న్యాయపోరాటాన్ని ఆపేందుకు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదని రైతులు తేల్చి చెప్పారు. నియంత్రించేందుకు ప్రయత్నిస్తే నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. న్యాయస్థానాల్లో అంతిమ విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : తిరుమలలో వైభవంగా గరుడ సేవ